వైఎస్‌ కుటుంబంపై దుష్ప్రచారాన్ని ఆపాలి | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ కుటుంబంపై దుష్ప్రచారాన్ని ఆపాలి

May 28 2026 12:52 AM | Updated on May 28 2026 12:52 AM

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): దివంగత నేతలు వైఎస్‌ రాజారెడ్డి, రాజశేఖరరెడ్డిపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, వీటిని ఇప్పటికై నా ఆపాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఇందిరా భవన్‌లో విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ప్రజలను కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. సీమలో జరిగిన అరాచకాలను ఎదిరించి ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తి వైఎస్‌ రాజారెడ్డి అని.. కడపలో ప్రజల కోసం 70 పడకల ప్రభుత్వాస్పత్రిని 1973లో నిర్మించి ఉచిత వైద్యాన్ని అందించారని గుర్తుచేశారు. పార్టీలకతీతంగా సుపరిపాలనను అందించి.. పేదల కోసం ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలను దివంగత సీఎం వైఎస్సార్‌ అమలు చేశారని కొనియాడారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వీరిపై దుష్ప్రచారాలు చేయడం తగదని హితవు పలికారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 89,403 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 44,234 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.14 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం 3 గంటల్లో, సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తుకు నిర్దిష్ట సమయంలో దర్శనం లభిస్తుంది.

పక్కాగా ఓటరు జాబితా సమగ్ర సవరణ

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)ను పక్కాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. ఓటరు జాబితాకు సంబంధించిన విధివిధానాలపై కలెక్టరేట్లోని తన చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘ మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితాలను క్షుణ్ణంగా నవీకరించడం, ధ్రువీకరించడం, తప్పులను సరిదిద్దడమే లక్ష్యంగా సవరణ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. లోపాల్లేని పారదర్శకమైన ఓటరు జాబితాకు రాజకీయ పార్టీలు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు సహకరించాలని కోరారు. వచ్చే నెల 15 నుంచి జూలై 14 వరకు బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటింటి సర్వేను నిర్వహించి ఓటర్ల వివరాలను పరిశీలించనున్నా రని వెల్లడించారు. అదే సమయంలో పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ ప్రక్రియనూ పూర్తి చేయనున్నామని తెలిపారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అదే రోజు నుంచి ఆగస్ట్‌ 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించనున్నామని ప్రకటించారు. సెప్టెంబర్‌ 18 వరకు అభ్యంతరాలను పరిష్కరించి.. అదే నెల 22న తుది ఓటరు జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నామన్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చూడటం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, కచ్చితమైన ఓటరు జాబితాను తయారు చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. డీఆర్వో విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలోని ముస్లిం సోదరులకు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో బక్రీద్‌ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ప్రతీకగా బక్రీద్‌ నిలుస్తోందని తెలిపారు. ముస్లింలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఒక్కరిపై అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement