జిల్లాలో గాలీవాన | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో గాలీవాన

May 28 2026 12:52 AM | Updated on May 28 2026 12:52 AM

పలుచోట్ల విరిగిన చెట్ల కొమ్మలు

వర్షంతో కాస్త సేదతీరిన ప్రజలు

మర్రిపాడులో 35.2

మిల్లీమీటర్ల వర్షపాతం

నెల్లూరు (అర్బన్‌): జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 3.30 నుంచి ఈదురుగాలులు వీచాయి. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అప్పటి వరకు భానుడి భగభగలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అనేక మండలాల్లో పెద్ద ఎత్తున గాలులు వీయగా, పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

వర్షపాతమిలా..

మర్రిపాడు మండలంలో అత్యధికంగా 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరికుంటపాడులో 26.4, చేజర్లలో 25.2, ఆత్మకూరులో 22.6, దుత్తలూరులో 20.8, ఉదయగిరిలో 17.4, కలువాయిలో 17.0, వెంకటాచలంలో 14.4, రాపూరులో 12.6, అల్లూరులో 7.4, విడవలూరులో 7.2, బుచ్చిరెడ్డిపాళెంలో 5.8, బోగోలులో 5.6, దగదర్తిలో 5.4, అనంతసాగరంలో 5.2, తోటపల్లిగూడూరులో 4.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరికొన్ని మండలాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.

విద్యుత్‌ శాఖకు రూ.15 లక్షల నష్టం

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు నగరంలో బుధవారం తెల్లవారుజామున వీచిన ఈదురుగాలులతో విద్యుత్‌ సంస్థకు రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. నగరంలోని ఎంజీబీ మాల్‌ పక్కన వీధిలో ఓ భారీ చెట్టు లైన్లపై పడటంతో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పునరుద్ధరణ పనులను సిబ్బంది యుద్ధప్రాతిపదికన చేపట్టారు. 11 కేవీ స్తంభాలు 12.. ఎల్టీ స్తంభాలు ఏడు.. ట్రాన్స్‌ఫార్మర్లు మూడు దెబ్బతిన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement