బక్రీద్‌ను ఆనందంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌ను ఆనందంగా జరుపుకోవాలి

May 28 2026 12:16 AM | Updated on May 28 2026 12:16 AM

పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి

నెల్లూరు(పొగతోట): త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ పండగను ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో ఆయన ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ధూ అల్‌ హిజ్జా అనే ఇస్లామిక్‌ నెలలో వచ్చే పండగ హజ్‌ యాత్ర ముగింపును సూచిస్తుందన్నారు. ఈ పండగ ప్రవక్త ఇబ్రహీం గొప్ప త్యాగాన్ని గుర్తు చేస్తుందన్నారు.

దేశాన్ని చుట్టి రావడమే ధ్యేయం

మారథాన్‌ రన్నర్‌ సూఫియా

మనుబోలు: పరిగెడుతూ భారతదేశాన్ని చుట్టి రావడమే లక్ష్యమని ప్రసిద్ధ అల్ట్రా మారథాన్‌ రన్నర్‌ సూఫియా తెలిపారు. కన్యాకుమారి నుంచి కారకోరం పర్వతశ్రేణి వెళ్తూ మంగళవారం రాత్రి మనుబోలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మనుబోలు హైవే వద్ద కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. తన సొంత ఊరు రాజస్థాన్‌లోని అజ్మీర్‌ అని, మారథాన్‌ రన్నింగ్‌లో తాను పలు గిన్నీస్‌ రికార్డులు నెలకొల్పినట్లు తెలిపారు. 2019లో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సుమారు 4 వేల కిలోమీటర్ల దూరాన్ని వేగంగా పరిగెత్తిన మహిళా రన్నర్‌గా రికార్డు సాధించానన్నారు. ముంబై, చైన్నె, కోల్‌కతా, ఢిల్లీ నగరాలను కలిపే స్వర్ణ చతుర్భుజి రహదారిని 2021లో చుట్టి వచ్చినట్లు తెలిపారు. అలాగే హిమాలయ పర్వతాల్లోని ఐదు ఎత్తయిన పర్వత మార్గాల్లో సుమారు 480 కిలోమీటర్ల దూరాన్ని 98 గంటల 27 నిమిషాల్లో పూర్తి చేసి 2023లో రికార్డు నెలకొల్పినట్లు తెలిపారు. ఇలా ఇప్పటి వరకు ఐదు గిన్నీస్‌ రికార్డులు సాధించానన్నారు. ప్రస్తుతం కన్యాకుమారి నుంచి చైనా సరిహద్దులో లడఖ్‌ ప్రాంతంలో ఉన్న కారకోరం వరకు పరుగెడుతున్నట్లు తెలిపారు.

రైల్లోంచి జారిపడి

వ్యక్తికి తీవ్రగాయాలు

కోవూరు: గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని పడుగుపాడు రైల్వేస్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. గూడూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్యాసింజర్‌ రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి జారిపడి గాయపడడంతో గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రుని వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

న్యాయశాఖ ఉద్యోగులకు ఆత్మీయ సన్మానం

నెల్లూరు (లీగల్‌): న్యాయ శాఖలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ చేసిన డి.ఆంజనేయులు, కె.శ్రీనివాసులు, జి.శ్రీరాములు, ఎండీ మహబూబ్‌బాషాలను న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ పాల్గొని, మాట్లాడారు. సుదీర్ఘకాలం న్యాయ శాఖలో క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందడం సంతోషకరమన్నారు. మరో ముగ్గురు అదనపు జిల్లా జడ్జిలు ఆర్‌.శరత్‌బాబు, జి.గీత, కె.శైలజ పాల్గొని, మాట్లాడారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పీవీ నారాయణరెడ్డి, వెంకటసునీల్‌, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement