● మన పార్టీ ఓట్లను పదిలపరుచుకోవాలి
● కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(వేదాయపాళెం): అధికార పార్టీ నాయకులు గెలుపే పరమావధిగా సాగించే అన్ని కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు బూత్ లెవల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న కల్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం మన ప్రాధాన్యాంశంగా ఉండాలన్నారు. అదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా తగిన చర్యలు చేపట్టాలని వివరించారు. 2002లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహించారని, తిరిగి 24 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న ప్రక్రియలో మన పార్టీ ఓట్లను పదిలపరుచుకోవాలని సూచించారు. చంద్రబాబుకు ఎటువంటి ముందుచూపు, పాలనపై పట్టులేవన్నారు. గజకర్ణ, గోకర్ణ విద్యలతో అక్రమంగా లబ్ధిపొందేందుకు ఎంతటి దుర్మార్గపు చర్యలకై నా పాల్పడగలడన్నారు. వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించే ప్రయత్నాలు, కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో కూడా దొంగఓట్లను చేర్పించిన ఘనుడు చంద్రబాబు అని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికార పార్టీకి కొందరు అధికారులు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని, జాబితాలో మార్పులు, చేర్పుల సమయంలో నిబంధనల మేరకు న్యాయబద్ధంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. సర్పంచ్‌లుగా చేసిన వారికి క్షేత్రస్థాయిలో ఓటర్ల పట్ల, గ్రామాలపై సమగ్రమైన అవగాహన ఉంటుందని, అటువంటి వారు బీఎల్‌ఏలుగా ఉండడం పార్టీకి ఎంతో కలిసొచ్చే అంశమని వెల్లడించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లను సోమిరెడ్డి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడని, చెక్‌పవర్ నిలిపివేయడం, సర్పంచ్ పదవులను రద్దుచేయడం, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కలెక్టర్ సర్పంచ్‌లను తొలగించడం వంటి అనేక దుశ్చర్యలకు సోమిరెడ్డి పాల్పడ్డాడని తెలిపారు. వెంకటాచలం మండలానికి చెందిన రాజేశ్వరి అనే మహిళా సర్పంచ్‌ను సైతం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన ఘనత టీడీపీకి దక్కుతుందని పేర్కొన్నారు.
పటిష్ట నాయకత్వం మన సొంతం
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అధైర్యపడవద్దని, విపత్కర పరిస్థితులలో ఎటువంటి దుర్మార్గపు శక్తులనైనా ఎదుర్కొనే పటిష్ట నాయకత్వం, ధైర్యం మనకు మాత్రమే సొంతమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. తన తండ్రి గోవర్ధన్‌రెడ్డిని అక్రమ కేసులతో జైలుకు పంపారని, అటువంటి కష్టకాలంలో ప్రతి కార్యకర్త, నాయకులు వెనక్కు తగ్గకుండా గుండెనిబ్బరంతో నిలబడ్డారని పేర్కొన్నారు. పార్టీ జెండాను తిరిగి బలంగా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని తెలిపారు. తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల పదవీ విరమణ పొందిన సర్పంచ్‌లను సన్మానించారు. సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుట్టా శివశంకర్‌రెడ్డి, సర్వేపల్లి పరిశీలకుడు వీరి చలపతిరావు, పార్టీ జాయింట్ సెక్రటరీ మహేష్ తదితరులు ప్రసంగించారు.


