అదుపుతప్పి జేసీబీని ఢీకొన్న బస్సు | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి జేసీబీని ఢీకొన్న బస్సు

May 28 2026 12:16 AM | Updated on May 28 2026 12:16 AM

తొమ్మిది మందికి తీవ్రగాయాలు

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

డ్రైవర్‌ నిద్రమత్తే కారణమంటున్న

ప్రయాణికులు

కోవూరు: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న జేసీబీని ఢీకొన్న ఘటన మండల పరిధిలోని పడుగుపాడు సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 2.30 సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మందికి తీవ్రగాయాలు కాగా, 15 మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. కావలి నుంచి నెల్లూరుకు సుమారు 40 మంది ప్రయాణికులతో నాన్‌స్టాప్‌ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. పడుగుపాడు సెంటర్‌లో రోడ్డు పక్కన పనులు జరుగుతుండగా బిహార్‌కు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పడుగుపాడు సెంటర్‌కు వచ్చేసరికి బస్సు అదుపుతప్పి పక్కనున్న జేసీబీని ఢీకొట్టింది. ఈ క్రమంలో జేసీబీలో ఉన్న ముగ్గురు బిహార్‌కు చెందిన కూలీలతో పాటు బస్సులో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిలో బిహార్‌కు చెందిన గణేష్‌కుమార్‌, అనంతకుమార్‌, రమేష్‌కుమార్‌తో పాటు బస్సులో ఉన్న శ్రీనివాసులు, శ్రీరామ్‌కుమార్‌, ఇమ్మానుయేల్‌, రమ్యశ్రీ, వినీత, మయూరి ఉన్నారు. అలాగే బస్సు డ్రైవర్‌కు కాలు విరగ్గా అతని పేరు తెలియరాలేదు. కాగా 15 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరు, కోవూరు వైద్యశాలలకు తరలించారు.

రాజుపాళెం నుంచే అదుపుతప్పినట్లుగా..

ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని బస్సులోని ప్రయాణికుడు శ్రీనివాసులు తెలిపారు. రాజుపాళెం నుంచి బస్సు అదుపు తప్పినట్లు నడుస్తోందని, డ్రైవర్‌ అలసటతో ఉన్నట్లు కనిపించాడని తెలియజేశారు. ఎస్సై ముత్యాలరావు సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల వివరాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపం కారణమా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ప్రమాదంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రహదారిపై నిలిచిపోయిన బస్సును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

Advertisement
 
Advertisement
Advertisement