నెల్లూరు(అర్బన్): ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామంలో ఉన్న సెంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ థర్మల్ విద్యుత్ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆ సంస్థ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీబొమ్మ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతర కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ కార్మికులకు రూ.9 వేల నుంచి రూ.11 వేల వరకు మాత్రమే ఇస్తూ యాజమాన్యం శ్రమ దోపిడీ చేస్తోందన్నారు. అనేక దఫాలుగా జీతాలు పెంచాలని వినతులిచ్చి, చర్చలు జరిపినప్పటికీ యాజమాన్యం పట్టించుకోక పోగా పోలీసులను ఉపయోగించి కార్మికులను బెదిరించడం దుర్మార్గమన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే గత పది రోజులుగా విధులు బహిష్కరించి నిరసనలు చేస్తున్నారన్నారు. భూములు కోల్పోయిన నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి చివరికు కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి ప్రతి కార్మికునికి రూ.26 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతి పత్రం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సీఐటీయూ నాయకులు కె.పెంచలనరసయ్య, అంకయ్య, సుధాకర్, భాస్కర్, మస్తాన్ పాల్గొన్నారు.


