కావలి: మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆయన సోదరుడు చిరంజీవిని దుర్భాషలాడినట్లు కొందరు మార్ఫింగ్ ఆడియోలు చేసి ప్రజల్లో తీవ్ర గందరగోళం సృష్టించారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి దోషులను శిక్షించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కావలి డీఎస్పీ రమణకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే విధంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మార్ఫింగ్ ఆడియోలను నమ్మి కొంతమంది మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరికలు చేయడం అత్యంత ప్రమాదకరమైన విషయమన్నారు. ఇది కేవలం నాయకులపై వ్యక్తిగత దాడి మాత్రమే కాకుండా ప్రతిపక్షాలను అణిచి వేయాలనే కుట్రగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ఇలాంటివి జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు చూస్తూ ఊరుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులు, ఇళ్లపై, కార్యకర్తలపై దాడులు చేసి బెదిరిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందో తెలియాలన్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఆడియోలతో పాటు అసత్య ప్రచారాలతో రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడిస్తామని బెదిరింపులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు జంపాని రాఘవులు, ప్రసాద్, కనపర్తి రాజా, ఆర్కే కృష్ణారెడ్డి, ముంగమూరు మహేష్‌రెడ్డి, యూత్ విభాగం నేతలు మహేష్, గనిబాయ్ పాల్గొన్నారు.


