తెగిన విద్యుత్‌ తీగలే.. యమపాశాలై.. | - | Sakshi
Sakshi News home page

తెగిన విద్యుత్‌ తీగలే.. యమపాశాలై..

May 28 2026 12:16 AM | Updated on May 28 2026 12:16 AM

మండల పరిధిలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వీచిన బలమైన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో చాలాచోట్ల విద్యుత్‌ తీగలు పంట పొలాలపై పడ్డాయి. వీటి గురించి తెలియకుండా ఎప్పటిలాగే పొలాల వద్దకు వెళ్లి ఓ మహిళ మరణించగా, మేత కోసం వెళ్లిన 13 గేదెలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

తిరునాళ్లకు పుణే నుంచి వచ్చి మృతి

సీతారామపురం: మండలంలోని కొయ్యలపాడు గ్రామంలో బుధవారం వేకువజామున చలసాని వెంకట సుబ్బమ్మ (53) అనే మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంకట సుబ్బమ్మ తన భర్త, ఇద్దరు పిల్లలతో మహారాష్ట్రలోని పుణేలో స్థిరపడ్డారు. ఇటీవల గ్రామంలో తిరునాళ్ల, వివాహ కార్యక్రమాల్లో భాగంగా ఆమె 15 రోజుల క్రితం గ్రామానికి వచ్చారు. మరో రెండు మూడు రోజుల్లో పూణేకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురు గాలులకు బహిరంగ ప్రదేశాల్లో అమర్చిన విద్యుత్‌ స్తంభాల కరెంటు తీగలు తెగిపడ్డాయి. బుధవారం వేకువజామున బహిర్భూమికి వెళ్లిన వెంకటసుబ్బమ్మ తెగిన తీగను గమనించకుండా కాలును కరెంటు వైరుపై పెట్టడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. వెంకట సుబ్బమ్మ అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement