మేతకెళ్లి 13 గేదెలు మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

మేతకెళ్లి 13 గేదెలు మృత్యువాత

May 28 2026 12:16 AM | Updated on May 28 2026 12:16 AM

సీతారామపురం: మండలంలోని గంగవరం గ్రామంలో బుధవారం విద్యుదాఘాతానికి గురై ఏకంగా 13 గేదెలు మృతిచెందాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆవుల పెద్ద వెంకటసుబ్బయ్య రోజూ మాదిరిగానే తమ గ్రామానికి చెందిన సుమారు 70 గేదెలను బుధవారం ఉదయాన్నే తోలుకొని మేతకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి వీచిన బలమైన ఈదురు గాలుల ధాటికి పొలంలో 11 కేవీ విద్యుత్‌ తీగ పడి ఉన్నది. గేదెలు అటువైపుగా వెళ్లి విద్యుత్‌ తీగను తగిలి ఒకదాని వెంట మరొకటి వరుసగా 13 గేదెలు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. గేదెలు ఉన్నట్టుండి పడిపోవడం ఆ ప్రాంతంలో మంటలు చెలరేగుతుండడాన్ని గమనించిన పశువుల కాపరి వెంటనే మిగిలిన గేదెలను అటువైపు వెళ్లనీయకుండా దారి మళ్లించడంతో మిగిలిన గేదెల ప్రాణాలు కాపాడగలిగాడు. లేకుంటే భారీ సంఖ్యలో గేదెలు మత్యువాత పడేవి. దీనిపై మాజీ సర్పంచ్‌ దుగ్గయ్యకు తెలపడంతో ఆయన వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం అందించి విద్యుత్‌ సరఫరాను నిలిపి వేయించారు. ఈ ఘటనలో మేడిబోయిన సుబ్బమ్మ (3 గేదెలు), ఆవుల లక్ష్మి(2 గేదెలు), చిన్నదుగ్గయ్య (2 గేదెలు), రాగి లక్ష్మీదేవి(2 గేదెలు) బాలదుగ్గమ్మ, ఓబులమ్మ, వెంకటమ్మ, కోనమ్మలకు చెందిన 13 గేదెలు మృతి చెందడంతో సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటినట్లు బాధితులు వాపోతున్నారు. పాలకులు అధికారులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఘటనా స్థలాన్ని విద్యుత్‌, పశు వైద్య శాఖ అధికారులు సందర్శించి జరిగిన దుర్ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement