నిర్లక్ష్యం నీడలో ‘ఉపాధి హామీ’ | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం నీడలో ‘ఉపాధి హామీ’

May 27 2026 12:23 AM | Updated on May 27 2026 12:23 AM

నెల్లూరు(పొగతోట): జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఫీల్డ్‌ అసిస్టెంట్ల (ఎఫ్‌ఏ) కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనిచేస్తున్న దాదాపు 90 శాతం మందిని తొలగించడంతో గ్రామీణ ప్రాంతాల్లో పనుల నిర్వహణ దారుణంగా మారింది. కొత్త నియామకాల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా సగానికిపైగా గ్రామ పంచాయతీలు ప్రస్తుతం ఎఫ్‌ఏలు లేకుండానే కొనసాగుతున్నాయి.

జిల్లాలో 701 గ్రామ పంచాయతీలున్నాయి. సుమారు 400 పంచాయతీల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేరు. 2.78 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, 4.58 లక్షల మంది శ్రామికులు నమోదై ఉన్నారు. వీరిలో 3.48 లక్షల మంది యాక్టివ్‌ శ్రామికులు. అయినా సరిపడా సిబ్బంది లేకపోవడంతో పనుల కల్పనలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గతేడాది ఇదే సీజన్‌లో రోజుకు 80 నుంచి 85 వేల మంది వరకు శ్రామికులు పనులకు హాజరయ్యేవారు. ఇటీవల ఆ సంఖ్య 20 వేల వరకు పడిపోయింది. డ్వామా కొత్త పీడీ సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. సిబ్బందిపై ఒత్తిడి పెంచి, గ్రామాల వారీగా శ్రామికులను పనులకు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రోజుకు 45 నుంచి 50 వేల మంది వరకు పనులకు హాజరవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రాజకీయ కారణాలతో..

15 ఏళ్లుగా పనిచేస్తున్న అనేకమంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను వైఎస్సార్‌సీపీ అనుకూలంగా వ్యవహరించారనే సాకు చూపి తొలగించారు. ఎటువంటి ఆరోపణలు లేకపోయినా రాజకీయ కారణాలతోనే తొలగింపులు జరిగాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కోర్టును ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకున్నా.. వాటి అమలులో అధికారులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కొత్త ఎఫ్‌ఏల నియామకాలకు ప్రయత్నాలు జరిగినా, నిబంధనలు అడ్డంకిగా మారడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం. ఫలితంగా వందలాది గ్రామ పంచాయతీలు ప్రస్తుతం ఎఫ్‌ఏలు లేకుండానే నడుస్తున్నాయి.

అదనపు భారం

ఎఫ్‌ఏలు లేని ప్రాంతాల్లో మేట్లను ఇన్‌చార్జిలుగా నియమించాలని భావించారు. అయితే అది పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన నిబంధనల ప్రకారం పనులకు హాజరైన శ్రామికుల ఫొటోలను రోజుకు రెండుసార్లు మొబైల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఒక గ్రామ పంచాయతీలో 150 మంది వరకు పనులకు హాజరవుతుంటే, వారి ఫొటోలను రెండు విడతల్లో అప్‌లోడ్‌ చేయడం తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. ప్రస్తుతం చాలాచోట్ల ఒక్క ఫొటో మాత్రమే అప్‌లోడ్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఒకసారి ఫొటోలు అప్‌లోడ్‌ చేయడానికే రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని సిబ్బంది చెబుతున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు ప్రతి 30 మంది శ్రామికులకు ఒక మేట్‌ను నియమించి, వారి మొబైల్‌ ఫోన్లను రిజిస్టర్‌ చేయించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే గతంలో 30 మంది శ్రామికులను పర్యవేక్షించినందుకు మేట్లకు రూ.60 వరకు చెల్లింపులు ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో మేట్లు మొబైల్‌ రిజిస్ట్రేషన్‌కు ఆసక్తి చూపడం లేదు.

వేతనాల మంజూరులో జాప్యం

ఫొటో అప్‌లోడ్‌ ప్రక్రియ సక్రమంగా పూర్తి కాకపోతే శ్రామికుల వేతనాలు జమ కావడం లేదు. కొన్ని గ్రామాల్లో నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా రాజకీయ కారణాలతో కొంతమందిని పనులకు రానివ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. గతంలో అనేక పనులను అధికారులు రద్దు చేయడంతో గ్రామాల్లో పనుల కొరత ఏర్పడింది.

వేధిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల కొరత

సగానికిపైగా పంచాయతీల్లో ఖాళీలు

పనుల కల్పనలో జాప్యం

మొబైల్‌ రిజిస్ట్రేషన్‌తో కొత్త సమస్యలు

Advertisement
 
Advertisement
Advertisement