ఎరువు.. బరువు | - | Sakshi
Sakshi News home page

ఎరువు.. బరువు

May 27 2026 12:23 AM | Updated on May 27 2026 12:23 AM

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలకు రెక్కలు

ఖరీఫ్‌ వరి సాగుపై రైతుల ఆందోళన

ఇప్పటికే పెరిగిన సాగు ఖర్చులు

సంక్షోభంలో వ్యవసాయ రంగం

పొదలకూరు: వ్యవసాయ రంగం ఇప్పటికే సంక్షోభంలో ఉంది. పెరుగుతున్న సాగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఒక్కసారిగా పెరగడం రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యూరియా, డీఏపీ ధరలను యథాతథంగా ఉంచిన కేంద్ర ప్రభుత్వం, పంటల సమతుల్య పోషణకు కీలకమైన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను మాత్రం పెంచినట్లు తెలుస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో సుమారు 7 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. ఇందులో యూరియాతో పాటు వివిధ కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం అధికంగా ఉంటుంది. అయితే తాజాగా ధరల పెరుగుదలతో సాగు వ్యయం మరింత పెరిగే పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు

ఖర్చులు పెరిగే అవకాశం

ఖరీఫ్‌ ఎడగారు వరిసాగుకు రబీ సీజన్‌ కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరగడం, నాట్లు, కోతల వరకు డీజిల్‌ ధరలకు రెక్కలు రావడంతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రబీలో ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40 వేలు పెట్టిన రైతులు ఖరీఫ్‌లో మరో రూ.5 వేలు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. రైతులు అధికంగా వినియోగించే 20:20:0:13 రకం బస్తా ధర భారీగానే పెరిగింది. ఇందులో 13 శాతం గంధకం ఉంటుందని గతేడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది 50 కేజీల బస్తా 133 శాతం ధర ఎగబాకినట్టు తెలుస్తోంది. కొన్ని కంపెనీలు కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను త్వరలో పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వ్యాపారులు అంటున్నారు. 14:35:14, 10:26:26, 16:20:0:13, 28:28:0 తదితర రకాలను రైతులు వినియోగిస్తుంటారు. వీటి ధరలు బస్తాపై రూ.300 పెరిగినట్టుగా వ్యాపారులు వెల్లడిస్తున్నారు.

సమాచారమేదీ?

ఎరువుల ధరలు ఎప్పుడు ఎంత పెరుగుతున్నాయో రైతులకు సమాచారం ఉండటం లేదు. రేట్లు పెరిగే సమయంలో వారి నుంచి ప్రకటనలు కూడా ఉండటం లేదని అంటున్నారు. నిబంధనల ప్రకారం వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అదనంగా ఎరువుల విక్రయాలు ఉండకూడదు. అయితే కొందరు పెరిగిన ధరలను సాకుగా చూపుతూ పాత ధరల ఎరువులను కూడా కొత్త ఎమ్మార్పీలకు విక్రయిస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో వారి సిబ్బంది ద్వారా సమాచారమిచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎరువు ధర ఫిబ్రవరిలో.. ప్రస్తుతం

20:20:0:13 రూ.1,500 రూ.2,250

14:35:12 రూ.2,150 రూ.2,350

10:26:26 రూ.1,950 రూ.2,250

పొటాష్‌ రూ.1,850 రూ.1,973

28:28 రూ.1,800 రూ.2,200

ధరలు భరించలేకున్నాం

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను రైతులు భరించలేకపోతున్నారు. ప్రతి ఏడాది ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు విపరీతంగా పెంచేయడం జరిగింది. రైతులు వ్యవసాయం మానుకునే పరిస్థితి రాబోతున్నట్టు అర్థమవుతోంది. వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.

– కేతు రామిరెడ్డి, రైతు, కొనగలూరు

వ్యవసాయానికి కష్టకాలం

వ్యవసాయానికి కష్టకాలం వచ్చింది. ఎడగారు వరిసాగు నాట్లు వేస్తున్నాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుల బాధలు వర్ణనాతీతం. డీజిల్‌ ధరలు పెరగడంతో వరి సాగు ఖర్చులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ధాన్యానికి గిట్టుబాటు ధరలు లభించకుంటే కోలుకునే పరిస్థితి ఉండదు.

– పి.లచ్చారెడ్డి, రైతు, తాటిపర్తి

Advertisement
 
Advertisement
Advertisement