పేదల గొంతు కోస్తామంటే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

పేదల గొంతు కోస్తామంటే ఊరుకోం

May 27 2026 12:23 AM | Updated on May 27 2026 12:23 AM

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి

నెల్లూరురూరల్‌: అభివృద్ధి పేరుతో రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి నారాయణ పేదల గొంతు కోస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. నెల్లూరులోని ఐదో డివిజన్‌ పాత చెక్‌పోస్టు సెంటర్‌ జాఫర్‌సాహెబ్‌ కాలువ పక్కన నివాసముంటున్న పేదలు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఆదేశాలివ్వడంతో ఆయన మంగళవారం వారివద్దకెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మమ్మల్ని అధికారులు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటున్నారు. లేకుంటే జేసీబీతో ఇళ్లను కూల్చి వేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు’ అని స్థానికులు చంద్రశేఖర్‌రెడ్డికి గోడు వెళ్లబోసుకున్నారు. మరోచోటికి వెళ్తే బతకలేమని, ఈ ప్రాంతంలోనే తమకు నివాసాలు కట్టించి ఇచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

అండగా ఉంటాం

పేదలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంతో మాట్లాడతానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఇళ్లు కూలదోస్తామని అధికారులు బాధితులను భయపెట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. ఒక్కసారిగా ఖాళీ చేసి వెళ్లాలంటే పెదలు ఎక్కడికి వెళ్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రి నారాయణ నిజంగా ఇక్కడ అభివృద్ధి ఇస్తామంటే దానిని వైఎస్సార్‌సీపీ స్వాగతిస్తుందన్నారు. మంత్రి తన ఎన్‌ టీం కోసమే ఈ విధంగా పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాలువ రివిట్‌మెంట్‌ పనులు చేపడుతున్నామనే పేరుతో పేదలను మరోచోటుకు పంపాలనుకోవడం సరికాదన్నారు. పనులు చేపట్టాలని నిజంగా భావిస్తే ఎంతవరకు స్థలం కావాలో అంతమేర కొలతలు వేయాలన్నారు. అక్కడి వరకు వదిలేసి మిగిలిన స్థలంలో పేదలకు నివాసాలు కల్పించాలన్నారు. నారాయణ ఇక్కడ రివిట్‌మెంట్‌ పనులు చేపట్టి అనంతరం దుకాణాలు ఏర్పాటు చేసి తన ఎన్‌ టీం సభ్యులకు ఇవ్వాలన్న ఆకాంక్షతోనే ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. అలా దుకాణాలు కేటాయిస్తే మొదట ఇక్కడ స్థానికులకే ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలా కాదని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఏకపక్షంగా ముందుకెళ్తే వైఎస్సార్‌సీపీ పేదల పక్షాన నిలబడి పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement