కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం

May 27 2026 12:23 AM | Updated on May 27 2026 12:23 AM

బీసీ సంక్షేమ సంఘం

రాష్ట్రాధ్యక్షుడు నాగకిషోర్‌ యాదవ్‌

నెల్లూరు(వేదాయపాళెం): కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రాధ్యక్షుడు బొమ్మి నాగకిషోర్‌ యాదవ్‌ విమర్శించారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా యాదవ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించిన హామీలు అమలుకాక నీటిమూటలుగా మిగిలిపోయాయని ఆరోపించారు. 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్‌, రక్షణ చట్టం, సబ్‌ప్లాన్‌, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు, కార్పొరేషన్‌ నిధులు, విదేశీ విద్య పథకం వంటి పథకాలేవీ అమల్లోకి రాలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీలను కులవృత్తుల పేరుతో విభజించి వారిని అదే వృత్తులకు పరిమితం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 ఎమ్మెల్యే స్థానాల్లో కనీసం ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించకపోవడం టీడీపీ చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో 50 శాతం కంటే ఎక్కువగా ఉన్న బీసీలకు సరైన ప్రాధాన్యత, గుర్తింపు దక్కడం లేదన్నారు. జిల్లాలోని 10 ఏఎంసీల్లో బీసీలకు కేటాయించిన ఏకై క స్థానాన్ని కూడా ఇప్పటి వరకు భర్తీ చేయలేదని దుయ్యబట్టారు. బీసీలకు కేటాయించిన ఉదయగిరి ఏఎంసీ చైర్మన్‌ పదవిని వెంటనే కేటాయించాలన్నారు. ప్రభుత్వం కాకుండా బీసీ వ్యతిరేక కూటమిగా మారుతోందనే అనుమానం వ్యక్తమవుతోందన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సమాది శ్రీనివాసులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ముత్యం గౌడ్‌, రావులపల్లి వెంకటజ్యోతి, గురవయ్య, రాజగోపాల్‌, గంగుల మధుసూదన్‌రావు, గోపాల్‌, సుబ్రహ్మణ్యం, కిషోర్‌, ఏవీ లక్ష్మి, పాలూరు లక్ష్మి, అన్నంగి రమణయ్య, జెట్టి వేణు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement