జిల్లాలో మాతాశిశు మరణాల నమోదు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో మాతాశిశు మరణాల నమోదు

May 27 2026 12:23 AM | Updated on May 27 2026 12:23 AM

డీఎంహెచ్‌ఓ సుజాత

నెల్లూరు(అర్బన్‌): ఏప్రిల్‌ నెలతోపాటు ప్రస్తుత మే నెలలో జిల్లాలో ఒక మాతృ, ఆరుగురు శిశువుల మరణాలు నమోదయ్యాయని డీఎంహెచ్‌ఓ సుజాత తెలిపారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో మాతాశిశు మరణాలపై సబ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఈ మరణాలకు గల కారణాలు, లోపాలపై సంబంధిత వైద్యులు, ఏఎన్‌ఎంలను ప్రశ్నించి వివరాలు సేకరించారు. గర్భం దాల్చిన ప్రతి మహిళను వెంటనే గుర్తించి రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశించారు. గర్భధారణ ప్రారంభం నుంచి ప్రసవం వరకు ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించారు. గర్భిణులకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు రక్తహీనత రాకుండా ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు తప్పనిసరిగా అందించాలని తెలిపారు. అధిక రక్తపోటు వంటి హైరిస్క్‌ కేసులను ముందుగానే గుర్తించి వారికి ప్రత్యేక వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పుట్టిన శిశువులకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని, షెడ్యూల్‌ ప్రకారం సమయానికి టీకాలు వేయించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి (డీసీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ పరిమళ, జీజీహెచ్‌ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ గీతాలక్ష్మి, డాక్టర్‌ కళ్యాణ్‌కుమార్‌, డాక్టర్‌ మేరీ స్నిగ్ధ, డాక్టర్‌ శోభారాణి, పీడియాట్రిక్‌ వైద్యుడు డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement