నెల్లూరు సిటీ: పాముకాటుకు గురై మహిళ మృతిచెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలంలోని కొత్త వెల్లంటిలో మనవరపు మమత (42) నివాసం ఉంటోంది. భర్త కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మమత ఇంటి వద్ద టిఫిన్ అంగడి నిర్వహిస్తోంది. ఆమెకు పూజిత, నిఖిత అనే కుమార్తెలున్నారు. పూజిత చైన్నెలో ఉద్యోగం చేస్తుండగా, నిఖిత చదువుకుంటోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8:30 నిమిషాలకు మమత ఇంట్లో పనిచేస్తోంది. ఆ సమయంలో పాము కాటు వేసింది. దీంతో బయటకు వచ్చి తనను పాము కాటు వేసిందని, జెర్రిపోతై ఉండొచ్చని భావించింది. దీంతో స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు చికిత్స నిమిత్తం వెళ్లింది. అతను ఇంజెక్షన్ వేశాడు. కొంతసేపటికి ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు సౌత్‌మోపూరు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి పరిస్థితి విషమంగా ఉందని, నెల్లూరులోని పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. వెంటనే ఆటోలో నెల్లూరుకు మమతను తరలిస్తుండగా ములుమూడి వద్ద చనిపోయింది. ఘటన జరిగిన రెండు గంటల వ్యవధిలో మృతిచెందింది. స్థానికులు నాగుపాముగా గుర్తించి చంపివేశారు. కాగా కుమార్తెలిద్దరూ ఒంటరి వారయ్యారు.


