ఎన్నికల్లో విజయమే లక్ష్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో విజయమే లక్ష్యం కావాలి

May 27 2026 12:23 AM | Updated on May 27 2026 12:23 AM

బూత్‌ లెవల్‌ ఏజెంట్లు సైనికుల్లా పనిచేయాలి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

కావలి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లు సైనికుల్లా పనిచేసి స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)పై బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని పట్టణంలోని ఆరెస్సార్‌ కల్యాణ మండపంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుట్టా శివశంకర్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ మహేష్‌తో కలిసి నివాళులర్పించిన అనంతరం కాకాణి మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ అనేది పార్టీ శ్రేణులకు అత్యంత కీలకమని, ప్రతి ఏజెంట్‌ శ్రద్ధతో పనిచేయాలని కోరారు. ఈ ప్రక్రియపై పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, ఈ తరుణంలో బీఎల్‌ఏలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అప్రమత్తంగా ఉండి ఏ ఓటూ పోకుండా చూడాల్సిన అవసరం ఉందని వివరించారు.

మోసాలు, కుట్రలు బాబుకు అలవాటే

మోసం, కుట్ర, దగా చేయడం సీఎం చంద్రబాబుకు కొత్త కాదని, అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని విమర్శించారు. ఆయనకు పరిపాలన చేతకాదన్నారు. రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని మండిపడ్డారు. ప్రత్యర్థులను అనైతిక మార్గాల్లో దెబ్బతీయడం.. తన కుటుంబం రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందడమే చంద్రబాబు ఏకై క లక్ష్యమని ఆరోపించారు. వీటన్నింటినీ ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు.

భారీ మెజార్టీతో గెలిపించాలి

రానున్న ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పోటీ చేయనున్నారని, ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గతంలో మంత్రిగా తాను.. ఎమ్మెల్యేగా ఆయన ఉన్న సమయంలో కావలిని ఎంతో అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. నియోజకవర్గంలో సమస్యలు సృష్టించే నాయకుడు కావాలా.. లేక వీటిని పరిష్కరించి అభివృద్ధి చేసే నేత కావాలో మీరే నిర్ణయించుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో రామిరెడ్డిని గెలిపించుకోలేకపోయామనే బాధ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. గ్యాస్‌ స్టౌ ఆపి చేపల కూర వండిన సీఎంను తానెక్కడా చూడలేదని, ఇలాంటి వ్యక్తి మనకు అవసరమానని ప్రశ్నించారు. మత్స్యకారుల ఇళ్లకు జగన్‌మోహన్‌రెడ్డి లేదా తామెళ్తే వారు వండిందే తినొస్తామని పేర్కొన్నారు. అయితే వారిళ్లలో అన్నం తినడం ఇష్టం లేక చేపల కూర పెట్టుకొని స్పూన్‌తో తిన్నట్లు నటించి మెప్పించేందుకు చంద్రబాబు యత్నించారని విమర్శించారు.

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

మత్స్యకారుల సంక్షేమం కోసం మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ఫిషింగ్‌ హార్బర్‌ను నిర్మించగా, ప్రస్తుత సీఎం హడావుడిగా వాటిని ప్రారంభించి తామే నిర్మించామని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్థులు ఆడుతున్న డ్రామాలను నమ్మొద్దని కోరారు.

కావలిలో అరాచక పాలన

కావలి నియోజకవర్గంలో అరాచక పాలన నడుస్తోందని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అక్రమ లేఅవుట్లు, దందాలను సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అశాంతిని నెలకొల్పి, తమ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. పగలూ, రాత్రనే తేడా లేకుండా గ్రావెల్‌ను అక్రమంగా కొల్లగొట్టి, రేషన్‌ మాఫియాను నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు.

దొంగ ఓట్లను చేర్చేందుకు యత్నం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన అర్హులైన ఓటర్లను తొలగించి.. దొంగ ఓట్లను చేర్చే యత్నాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని కాకాణి ధ్వజమెత్తారు. బీఎల్‌ఏలు, కార్యకర్తలు సమర్థంగా వ్యవహరించి వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సీఎం అయితే తమ పరిస్థితి ఏమిటనే భయం కూటమి నేతలతో పాటు చంద్రబాబులో నెలకొందని చెప్పారు. అభివృద్ధిని విస్మరించి ప్రజలను పక్కదోవ పట్టిస్తూ పబ్బం గడుపుకొంటున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయ్యాక.. ఆ పార్టీ శ్రేణులకు దూరంగా చంద్రబాబు ఉన్న అంశాన్ని గుర్తుచేశారు. అదే ప్రస్తుతం తమ పార్టీ అధికారంలో లేకపోయినా, పార్టీ నేతలు, కార్యకర్తలకు జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉండి.. వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా భరోసా ఇస్తున్నారని వివరించారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించి మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు కుట్రలు చేస్తారని మండిపడ్డారు. ఒకసారి జాబితా నుంచి ఓటును తొలగిస్తే దాన్ని తిరిగి పొందడం ఎంతో శ్రమతో కూడుకున్న పని అని గుర్తుచేశారు. దాదాపు 60 రోజుల పాటు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం జరగనుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement