● మహానాడు ప్రచారానికి టీడీపీ నేతల నికృష్టం
● ప్రసిద్ధ చాముండేశ్వరి ఆలయం
పసుపు రంగుల మయం
● అమ్మవారి విడిది కార్యక్రమాన్ని
నిలిపివేసిన చైర్మన్
● భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైనం
ఇందుకూరుపేట: టీడీపీ నేతలకు దేవుళ్లన్నా.. దేవాలయాలన్నా.. భక్తి, భయం లేకుండాపోయింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ అధినేత ఏకంగా దేవదేవుడైన వేంకటేశ్వరస్వామిని లడ్డూ ప్రసాదాల పేరుతో వాడుకుంటే.. స్థానిక నేతలు ఏకంగా మహిమాన్విత అమ్మవారి ఆలయాన్ని వాడుకోవడాన్ని భక్త జనులు జీర్ణించుకోలేపోతున్నారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా, భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోన్న గంగపట్నం చాముండేశ్వరీ దేవి ఆలయాన్ని పాలక మండలి రాజకీయ ప్రచారానికి వేదికగ్గా మార్చేసింది. ఆలయానికి జిల్లా నుంచే పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి అమ్మ వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇంతటి ప్రాచూర్యం, విశిష్టత కలిగిన ఆలయ ప్రాంగణాన్ని మహానాడు ప్రచార పైత్యంతో పసుపు రంగులతో ముంచెత్తారు. భక్తుల మనోభావాలతో పనిలేదన్నట్లుగా పచ్చ నేతలు నికృష్ట చర్యలు పరాకాష్టకు చేరాయంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంలో హుండీలు, గోడలతోపాటు అమ్మవారి ఆలయం ప్రాంగణంలోని కల్యాణ మండపానికి సైతం పసుపు రంగులు పులిమేశారు. ఇందు కోసం ఏకంగా అమ్మవారి విడిది కార్యక్రమాన్ని నిలిపివేసి అపచారానికి పాల్పడ్డారు.
అధికార మదంతో..
చారిత్రాత్మకమైన ఆలయంలో ఇప్పటి వరకు పలు పార్టీలకు చెందిన నాయకులు చైర్మన్లుగా, ధర్మకర్తలుగా పని చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి ఆలయాన్ని రాజకీయ ప్రచార వేదికగా మార్చేయడాన్ని చూసి భక్తులు మండి పడుతున్నారు. అధికార మదంతో అమ్మవారి ఆలయానికి పసుపు రంగులేసి వివాదానికి తెర తీశారు. భక్తులు కానుకలు సమర్పించేందుకు ఆలయంలో హుండీలు ఏర్పాటు చేశారు. ఆలయం తీర ప్రాంతంలో ఉండడంతో హుండీలు తుప్పు పట్టకుండా స్టీల్‌తో తయారు చేసిన హుండీలను ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేని విధంగా హుండీలకు పసుపు రంగును పులిమేశారు. సంప్రదాయంగా పవిత్రతగా పసుసు వస్త్రాన్ని చుడుతారు. కానీ హుండీలకు పూర్తిగా పసుపు రంగు పూసేశారు. కల్యాణ మండప భవనానికి పసుపు రంగులు వేయడం చూసిన టీడీపీ వర్గీయులే ఇదెక్కడ పైత్యమంటూ అసహ్యించుకుంటున్నారు. వారి తీరును బహిరంగంగా విమర్శలేక తమలో తాము మదన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మవారి రాకను ఆపేశారు
మరో నెల రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా మంచి రోజును చూసుకొని అమ్మవారిని (ఉత్సవ మూర్తి) ఊరి బయట ఉన్న ఆలయం వద్ద నుంచి గ్రామంలో ఉన్న శివాలయంలోకి తీసుకొచ్చి విడిది చేయిస్తారు. మేళతాళాల నడుమ చిన్న ఊరేగింపుగా తీసుకురావడం ఆనవాయితీ. ఈ తంతును గ్రామస్తులు, ఆలయ అధికారులు నాలుగు రోజుల క్రితం పూర్తి చేసేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే పాలక మండలి చైర్మన్ అధికార మదంతో పసుపు రంగుల పైత్యానికి ఇబ్బందులు వస్తాయని, ఆఖరి నిమిషంలో తనకు సమాచారం లేదని, అమ్మవారిని తీసుకెళ్లేది లేదని భీష్మించుకొన్నారు. అంతటితో ఆగక అమ్మ వారిని ఈ రోజు తీసుకెళ్లేందుకు వీల్లేదంటూ నిలిపేశారు. దీంతో చేసేదేమి లేక అమ్మ వారిని ఆలయం నుంచి తీసుకు రాకుండా నిలిపేశారు. ఇది విన్న గ్రామస్తులు, భక్తులు హతాసులయ్యారు. సంస్కృతి, సంప్రదాయం ప్రకారం నడుచుకోవాల్సిన పాలక మండలి చైర్మన్ రాజకీయ ప్రచార యావతో అమ్మవారి వేడుకను వాయిదా వేడయడం ఇప్పటి వరకు జరగలేదని భక్తులు మండిపడ్డారు. చైర్మన్, ఆలయ నిర్వహణాధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి రాజకీయలను ఆలయ విషయంలో ప్రోత్సహిచడం సముచితం కాదని, అమ్మవారి భక్తురాలైన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఇలాంటి నికృష్ట చర్యలకు పాల్పడిన చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


