● ఏపీఓ, ఎఫ్‌ఏకు షోకాజ్ నోటీసులు
● విచారణ పూర్తయ్యేంత వరకు జీతం నిలిపివేత
చేజర్ల: ఉపాధి హామీలో నకిలీ కూలీల ఉదంతంపై చేజర్ల మండలంలోని ఉపాధి కార్యాలయంలో విచారణను డ్వామా ఏపీడీ శంకర్‌నారాయణ మంగళవారం చేపట్టారు. ఉపాధిలో నకిలీ కూలీలు అనే శీర్షికన సాక్షిలో కథనం సోమవారం ప్రచురితమైన నేపథ్యంలో విచారణకు కలెక్టర్ ఆదేశించారు. ఈ తరుణంలో చేజర్ల ఏపీఓ వెంకటేశ్వర్లు, క్షేత్ర సహాయకుడు వెంకటరమణారెడ్డికి షోకాజ్ నోటీసులను అందజేశారు. విచారణ పూర్తయి నివేదికను ఉన్నతాధికారులకు అందించి తదుపరి చర్యలు చేపట్టేంత వరకు వీరికి సంబంధించిన నెలవారీ జీతాల జారీని నిలిపేయించామని ఏపీడీ తెలిపారు.
సమగ్ర ఎంకై ్వరీ
చేజర్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన మస్తర్లు, కూలీల నమోదు, ముఖ హాజరు లొకేషన్, ఏ సమ యానికి హాజరు తీసుకుంది, నకిలీ కూలీల పేరుతో ఎంత మొత్తాన్ని డ్రా చేశారు తదితర అంశాలను ఏపీడీ పరిశీలించారు. నకిలీ కూలీల మస్తర్ల నమోదు ద్వారా నగదు డ్రా చేసిన విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు. ఏపీఓ, క్షేత్ర సహాయకుడి నిర్లక్ష్యం కనిపిస్తోందని, వారిచ్చే వివరణ, విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నామని వెల్లడించారు.


