నెల్లూరు(వేదాయపాళెం) : నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన నెల్లూరు సిటీ, రూరల్ సమన్వయకర్తలు చంద్రశేఖరెడ్డి, విజయకు మార్‌రెడ్డితో కలిస విలేకరుల సమావేశంలో మాట్లా డారు. ఓటమి భయంతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రస్తుతం ఉన్న 54 డివిజన్లను 72 డివిజన్లుగా విభజించారని తెలిపారు. వైఎస్సార్‌సీపీకి పట్టు న్న, ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాలను ఇష్టా రీతిన చెల్లాచెదురు చేశారన్నారు. అనాధిగా కొన్ని ప్రాంతాలు సామాజిక, భౌగోళిక పరిస్థితులను అనుసరించి ఒకే డివిజన్‌లో ఉండేవని, ప్రస్తుతం గెలుపే పరమావధిగా టీడీపీ నాయకులు ప్రతి డివిజన్‌ను ముక్కలు చేసి వారికి అనుకూలంగా పునర్విభజన చేపట్టారని తెలిపారు. ముస్లింలు అధికంగా ఉండే జెండావీధి ప్రాంతాన్ని పునర్విభజనలో మూడు డివిజన్లలో కలపడమే అందుకు నిదర్శనమన్నారు. కొన్ని ప్రాంతాలను పెన్నానది అవతల, జాకీర్‌హుస్సేన్‌నగర్, నేషనల్ హైవేకు అవతల ఉన్న డివిజన్లలో కలపడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక్క కాలనీని అనేక డివిజన్లుగా విభజించడం వల్ల అనేక పాలనా పరమైన సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉండే ప్రాంతాలను విభజించి సుదూర డివిజన్లలో కలపడం ద్వారా జనాభా ప్రాతిపదికన వారికి దక్కాల్సిన రిజర్వేషన్లను సైతం అడ్డుకునేందుకు భారీ కుట్ర చేస్తున్నారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కుల గణన పూర్తికాకుండానే ఆగమేఘాల మీద డివిజన్ల పునర్వినజన ప్రక్రియను చేపట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. సామాజిక, భౌగోళిక అంశాలు, రిజర్వేషన్లు, జనాభాను పరిగణనలోకి తీసుకోకుండా డివిజన్లను విభజించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. డివిజన్ల పునర్విభజనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదోక రకంగా గెలవాలని మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని, దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత కౌన్సిల్ కాలపరిమితికి ముందే ఎన్నికలు నిర్వహించి దొడ్డిదా రిన అక్రమంగా గెలిచేందుకు వారు చేస్తున్న ప్రయ త్నాలు ఫలించబోవన్నారు. ప్రజలు అన్ని అంశాలను సునిశితంగా గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
పునర్విభజనలో నారాయణ రాజ్యాంగం
కార్పొరేషన్ పరిధిలో ఒక క్రమ పద్ధతి లేకుండా మంత్రి నారాయణ రాజ్యాంగంతో డివిజన్ల పునర్విభజన చేపట్టడం ప్రభుత్వ విచ్చల విడితనానికి నిదర్శనమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. పెన్నా నదికి ఇవతల ఉన్న బర్మాషెల్‌గుంట తదితర పాంతాలను అవతలి వైపున ఉన్న డివిజన్లలో కలిపారు. 13వ డివిజన్‌ను 16వ డివిజన్‌లో కలిపారు. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉండే 43వ డివిజన్‌ను మూడు ముక్కలు చేసి 44, 47, 48వ డివిజన్లలో కలిపారు. నగరంపై మంత్రి నారాయణకు అవగాహన లేదు. ఆయన 80 వేల ఇళ్లు తిరిగినట్లు అబద్ధాలు చెబుతున్నారు. 22 ఏళ్ల తర్వాత దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయితే భారీగా ఓటర్ల మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఈలోగానే హడావుడిగా పునర్విభజన చేపట్టాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు.
సర్వే నంబర్ల ఆధారంగా పునర్విభజన?
కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల పునర్విభజనను సర్వే నంబర్ల ఆధారంగా చేపట్టడం హాసాస్పదంగా ఉందని నెల్లూరు రూరల్ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి విమర్శించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కాకుండా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, టీడీపీ నాయకుల ఇష్టానుసారంగా కమిషనర్ డివిజన్ల విభజన చేపట్టినట్టు ఉంది. ఎన్నో ఏళ్లుగా చింతారెడ్డిపాళెం, సౌత్‌రాజుపాళెం ఒకటే డివిజన్‌లో ఉన్నాయని, ప్రస్తుతం వాటిని వేర్వేరుగా ఇతర డివిజన్లలో కలపడం విడ్డూరం. టీడీపీ గెలుపు కోసం దుర్మార్గపు ఆలోచలను అమలు చేయడంతో ఈ దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తప్పు చేసిన టీడీపీ నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా కుట్రపూరితంగా విభజన చేపడితే మూల్యం చెలించక తప్పదని హెచ్చరించారు.
అడ్డదారిలో గెలుపు కోసం
టీడీపీ కుటిల యత్నాలు
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి


