కోవూరు: ప్రభుత్వం జిల్లాలోని భారీ పరిశ్రమలకు అనుసంధానంగా ఎంఎస్‌ఎంఈ పార్కు లను ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు సోమవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా కోవూరు మండలం పడుగుపాడులో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్‌ఎంఈ పార్క్‌లో శిలఫలకాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దుత్తలూరు, కడివేడు, ఉలవపాళ్ల, పడుగుపాడులో ఎంఎస్‌ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. దుత్తలూరులో ఏర్పాటవుతున్న రక్షణ రంగానికి చెందిన డ్రోన్లు, మిస్సైల్స్ తయారీ పరిశ్రమలకు అనుసంధానంగా ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. గూడూరు ప్రాంతాన్ని భవిష్యత్తులో ఫర్నీచర్ పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ పడుగుపాడులో 14.5 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇఫ్కో కిసాన్ సెజ్‌లో 2,700 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయని వివరించారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులు, ఉద్యోగులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్లు వీరేంద్ర, మాధవి, ఆర్డీఓ అనూష, ఏపీఐఐసీ జెడ్‌ఎం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
పరీక్షలు ప్రారంభం
నెల్లూరు (టౌన్): పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు జరిగాయి. 1475 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 1124 మంది హాజరయ్యారు. 351 మంది గైర్హాజరయ్యారు.
ప్రశాంతంగా ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు
ఏపీ ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పదో తరగతి పరీక్షలకు 582 మంది అభ్యాసకులకు, 512 మంది హాజరయ్యారు. 70 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలకు 240 మందికి గాను, 202 మంది హాజరయ్యారు. 38 మంది అభ్యాసకులు గైర్హాజరయ్యారు. డీఈఓ బాలాజీరావు ఆయా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
ఎస్‌ఈఐఎల్ కార్మికులతో
చర్చలు విఫలం
ముత్తుకూరు(పొదలకూరు) : నేలటూరులోని ఎస్‌ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వద్ద 8 రోజులుగా ఆందోళన చేపడుతున్న కార్మికులతో కంపెనీ ప్రతినిధులు సోమవారం జరిపిన చర్యలు విఫలమయ్యాయి. తొలుత తోటపల్లిగూడూరు, ముత్తుకూరు మండలాలకు చెందిన అధికార పార్టీ నాయకులు అత్యుత్సాహంతో కార్మికుల ఆందోళన శిబిరం వద్దకు చేరుకుని చర్చలు జరిపారు. తాము 15 ఏళ్లుగా ప్రాజెక్టులో పనిచేస్తున్నామని, తక్కువ జీతంతో ఎలా జీవించాలని కూటమి నాయకులను కార్మికులు ప్రశ్నించారు. కూటమి నాయకులు గంటసేపటి తర్వాత ప్రాజెక్ట్ అధికారులను కార్మికుల వద్దకు తీసుకొచ్చారు. సీఐటీయూ నాయకులు ప్రసాద్, శ్రీనివాసులు, అంకయ్యతో చర్చలు జరిపారు. కార్మికులు ఆందోళన విరమిస్తే వేతనాలు పెంచే విషయంపైన ఆలోచించి పరిష్కారం చూపుతామని కూటమి నాయకులు ప్రాజెక్ట్ అధికారుల ద్వారా వివరించారు. ఐదు రోజులు గడువు కావాలని ప్రాజెక్ట్ అధికారులు కోరగా, అందుకు కార్మికులు సమ్మతించ లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ కనీస వేతన చట్టాన్ని అమలు చేసి నెలకు రూ.26 వేలు వేతనం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. కూటమి నాయకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. తమ పక్షాన నిలబడి న్యాయం చేయాల్సింది పోయి కూటమి నాయకులు కంపెనీ యాజమాన్యానికి వత్తాసు పలకడం ఏమిటని కార్మికులు ప్రశ్నించారు. తమ శ్రమను దోచుకుంటున్న పెట్టుబడిదారులను నిలదీయాల్సిందిపోయి వారి పక్షాన నిలబడి చర్చలకు రావడం విడ్డూరంగా ఉందన్నారు.


