● ఏబీఎం కాంపౌండ్ నుంచి
కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ
● పాల్గొన్న చంద్రశేఖర్‌రెడ్డి,
విజయకుమార్‌రెడ్డి
నెల్లూరు(అర్బన్): దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. మతం మారిన దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దు చేయడాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పలువురు పాస్టర్లు, క్రైస్తవులు నెల్లూరులోని ఏబీఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. వారికి చంద్రశేఖర్‌రెడ్డి, విజయకుమార్‌రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. మత ప్రాతిపదికన ప్రజలను విభజించడం సరికాదన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగాలన్నదే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అన్నారు. నేటి పాలకులు మతాల మధ్య చిచ్చురేపి ప్రజలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సమానంగా చూసి వారి హక్కులను కాపాడిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. దళిత క్రైస్తవులు కోరుకున్న న్యాయబద్ధమైన డిమాండ్‌కు వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. అలాగే సీపీఎం నాయకులు కత్తి శ్రీనివాసులు, సూర్యనారాయణ, కాంగ్రెస్ నేతలు కూడా మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు.


