● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అర్జీదారులు
నెల్లూరు(అర్బన్): ‘అయ్యా.. మా సమస్యలపై క్షేత్రస్థాయిలో అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. పలుసార్లు అర్జీలు ఇచ్చాం. అయినా పరిష్కరించలేదు. దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వచ్చాం. మీరైనా విన్నపాలు ఆలకించి సమస్యలు పరిష్కరించండి’ అంటూ పలువురు బాధితులు వేడుకున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్ మహేశ్వర్‌రెడ్డి తదితరులు వినతులు స్వీకరించారు.
ఫీజులను నియంత్రించాలి
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడాన్ని ప్రభుత్వం నియంత్రించాలని బీపీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు బుధవారపు బాలాజీ తదితరులు కోరారు. జూన్‌లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న విద్యాసంస్థలను వెంటనే మూసివేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు న్యాయబద్ధమైన జీతాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.


