చిన్నారిపై లైంగికదాడికి యత్నం | - | Sakshi
Sakshi News home page

చిన్నారిపై లైంగికదాడికి యత్నం

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు

నెల్లూరు(క్రైమ్‌): కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వృద్ధుడు వరుసకు మనుమరాలైన చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు దర్గామిట్ట పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ వివాహిత నివాసం ఉంటున్నారు. ఆమెకు తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. వరుసకు తాత అయిన వెంకటరమణయ్య ఆదివారం రాత్రి బారాషహీద్‌ దర్గా వద్ద భోజనాల ప్యాకెట్లు ఇస్తారని, తీసుకొద్దామని చిన్నారిని తీసుకెళ్లాడు. స్వర్ణాల చెరువు వద్ద చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. గమనించిన స్థానికులు వృద్ధుడికి దేహశుద్ధి చేయడంతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌ కల్యాణరాజుకు ఫిర్యాదు చేశారు. వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ సోమవారం వెల్లడించారు.

బైక్‌పై వెళ్తూ..

కారు ఢీకొని వ్యక్తి మృతి

సంగం: మండలంలోని సంగం – కొరిమెర్ల రహదారిలో మలుపు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటార్‌బైక్‌ను కారు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బోగోలు మండలం చెన్నారెడ్డిపాళేనికి చెందిన లక్ష్మయ్య (55) మరో వ్యక్తితో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

యువకుల అతివేగం..

గర్భిణికి ప్రమాదం

చిల్లకూరు: గూడూరు రెండో పట్టణంలోని కోర్టు సెంటర్‌లో సోమవారం గుర్తుతెలియని యువకులు దారుణానికి పాల్పడ్డారు. బైక్‌పై అతివేగంగా వెళ్తూ.. రోడ్డు దాటుతున్న నిండు గర్భిణిని ఢీకొట్టారు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక వ్యాపారాలు స్పందించిన బాధితురాలిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్లూకలర్‌ పల్సర్‌ బైక్‌లో ఇద్దరు యువకులు వేగంగా వెళ్లడాన్ని ఫుటేజీలో గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నారు.

9న వీఎస్‌యూ

స్నాతకోత్సవాలు..

వెంకటాచలం: మండలంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ 10, 11, 12వ స్నాతకోత్సవాలు జూన్‌ 9వ తేదీన నిర్వహించనున్నట్లు వర్సిటీ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్‌ ఆర్‌.మధుమతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకల్లో గత విద్యా సంవత్సరాల్లో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నట్లు తెలియజేశారు. దుస్తుల నియమావళి, అలాగే అర్హులైన విద్యార్థుల పూర్తి వివరాలను త్వరలో త్వరలో ద్వారా వెల్లడిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement