● చేపల గుంతలో పడి బాలుడి మృతి
సంగం: కుమారుడిని తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆటలతో, వచ్చీ రానీ మాటలతో కుటుంబానికి ఆనందాన్ని పంచుతున్న బాలుడి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. చేపల గుంతలో పడి ఏడాదిన్నర వయస్సున్న బాలుడు మృతిచెందిన విషాద ఘటన మండలంలోని దువ్వూరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చెంచయ్య, దీపిక దంపతులకు అభిలాష్ అనే కుమారుడున్నాడు. చెంచయ్య కూలీ పనులు చేస్తుంటాడు. బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సమీపంలోని చేపల గుంతలో పడిపోయాడు. కొంతసేపటికి తల్లిదండ్రులు కుమారుడి కోసం వెతగ్గా కనిపించలేదు. ఆందోళన చెందుతూ గ్రామస్తులతో కలిసి గాలించారు. ఇంతలో చేపల గుంతలో అభిలాష్ మృతదేహం తేలియాడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


