● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(అర్బన్): బక్రీద్ పండగ సందర్భంగా జిల్లాలో జంతు సంక్షేమ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరులోని తన కార్యాలయంలో జంతు సంక్షేమ చట్టాలు, జంతు వధ నిషేధం తదితర అంశాలకు చెందిన వాల్‌పోస్టర్లను ఎస్పీ అజిత, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం పశుసంవర్థక, మున్సిపల్, రవాణా శాఖ అధికారులతో కలిసి ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్ పండగను శాంతియుత వాతావరణంలో నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలన్నారు. పశువైద్యుల ధ్రువీకరణ పొందిన పశువులను పరిశుభ్రత పాటిస్తూ వధశాలల్లో వధించాలని కోరారు. ఒంటెలు, గోవులు, మూడు సంవత్సరాల్లోపు దూడలను వధించడం పూర్తిగా నిషేధమన్నారు. ఎస్పీ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ పరిధిలో వెంకటాచలం టోల్‌ప్లాజా, బుచ్చి, కావలి పరిధిలోని ముసునూరు టోల్‌ప్లాజా, పలుచోట్ల చెక్‌పోస్టులు పెట్టి ప్రత్యేక తనిఖీ బృందాలు పర్యవేక్షిస్తూ వీడియోగ్రఫీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పశుసంవర్థక శాఖాధికారి రమేష్ నాయక్, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, నోడల్ అధికారి యశోద తదితరులు పాల్గొన్నారు.


