చిల్లకూరు: గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ ఆకస్మిక బదిలీ వెనుక భూ వ్యవహారాలే ప్రధాన కారణమనే అనుమానాలు గూడూరు డివిజన్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా కడివేడు ప్రభుత్వ భూములు, క్రిస్‌సిటీ భూ సేకరణ పరిహారం వ్యవహారాల్లో ఆయన తీసుకున్న చర్యలే బదిలీకి దారితీశాయన్న వాదనలు రెవెన్యూ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆరునెలలపాటు సరైన పర్యవేక్షణ లేని గూడూరు డివిజన్ రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రెండునెలల క్రితం రామాయపట్నం పోర్టు భూసేకరణ అధికారిగా పనిచేస్తున్న సత్యనారాయణను ఆర్డీఓగా నియమించారు.
ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు
బాధ్యతలు చేపట్టిన వెంటనే సత్యనారాయణ పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో చిల్లకూరు, కోట మండలాల్లో ప్రతిపాదిత క్రిస్‌సిటీ ప్రాజెక్ట్‌కు సంబంధించి భూ సేకరణ పరిహారం ఆలస్యమవుతోందంటూ బాధిత రైతులు ఆర్డీఓను ఆశ్రయించారు. దీంతో ఆయన భూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి సరైన రీతిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియ పూర్తయితే రెవెన్యూ శాఖలోని కొంతమంది సిబ్బంది నుంచి రాజకీయ నాయకుల వరకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. క్రిస్‌సిటీ భూ పరిహార జాబితాలో తమ అనుచరుల పేర్లు చేర్చాలని పలువురు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు ఆర్డీఓ అంగీకరించకుండా నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తానని స్పష్టం చేసినట్లు తెలిసింది. ‘ఇక్కడ కాకపోతే మరోచోట పని చేసుకుంటాను’ అంటూ స్పష్టంగా చెప్పినట్లు రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. పదిరోజుల క్రితమే బదిలీ ఉత్తర్వులు అందినప్పటికీ, క్రిస్‌సిటీ భూ పరిహారం అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చి బాధితులకు సుమారు రూ.5 కోట్ల వరకు పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారని సమాచారం.
కడివేడు భూములపై..
చిల్లకూరు మండలం కడివేడు రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూముల వ్యవహారం రాష్ట్రస్థాయిలో చర్చకు రావడంతో ఆర్డీఓ సత్యనారాయణ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ భూములకు సంబంధించిన పాత రికార్డులను వెలికితీయడానికి ఆయన మూడు రోజుల పాటు రెవెన్యూ సిబ్బందిని తన కార్యాలయంలోనే కూర్చోబెట్టి పరిశీలన చేపట్టినట్లు సమాచారం. పాత రికార్డులు వ్యవహారం బయట పడితే గత తహసీల్దార్ శ్రీనివాసులు హాయంలో అధికార పార్టీ నేతలు చేసిన భూ బాగోతాలు ఎక్కడ బయట పడతాయోనని జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచి బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో గూడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో ఉన్న సమయంలో కూడా కడివేడు భూములపై పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. అప్పటి జాయింట్ కలెక్టర్ బాలాజీ ప్రత్యేక సర్వే బృందాలతో భూముల సర్వే చేపట్టగా, సగం వరకు ప్రక్రియ పూర్తయ్యాక అకస్మాత్తుగా సర్వే నిలిచిపోయింది. అనంతరం బాలాజీ బదిలీ కావడం చర్చనీయాంశమైంది.
అధికారుల కొరత
తిరుపతి జిల్లా నుంచి గూడూరును వేరు చేసిన అనంతరం ఇక్కడ డివిజన్ స్థాయి అధికారుల నియామకంలో సమస్యలు నెలకొన్నాయి. రెవెన్యూ, పోలీస్ శాఖల్లో కీలక పోస్టులకు అధికారులు రావడానికి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఆరు నెలలుగా గూడూరులో డీఎస్పీ స్థాయి అధికారి పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టకపోవడం కూడా పరిస్థితికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.
అడ్డు చెబితే బదిలీ తప్పదా?
గూడూరు నియోజకవర్గంలో అధికార నాయకుల నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించే అధికారులను బదిలీ చేస్తారనే భావన పలు శాఖల్లో వ్యక్తమవుతోంది. తమ నిర్ణయాలకు అడ్డుగా నిలిచే అధికారులను బదిలీ చేయడం, వివాదాల్లోకి లాగడం పరిపాటిగా మారిందన్న విమర్శలున్నాయి. గతంలో గూడూరు రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కింది స్థాయి ఉద్యోగులకు కవర్లు అందజేసిన ఘటనను లంచంగా ప్రచారం చేశారు. దీంతో అప్పట్లో తహసీల్దార్ తన కింద స్థాయి ఉద్యోగులను ఇలా చేయడం తనను కూడా అవినీతిపరుడిగా చూపించడమేనని మనస్తాపం చెంది బదిలీపై వెళ్లిపోయారు.
భూ వ్యవహారాలే
కారణమని ప్రచారం
సత్యనారాయణను బలి చేశారని చర్చ
కడివేడు భూములు, క్రిస్ సిటీ భూసేకరణ అంశాలే కారణమా..
పారదర్శకంగా వ్యవహరించడంతో సాగనంపారా?


