● తక్షణమే మార్పులు చేయాలి
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు): ‘పొంగూరు నారాయణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ నెల్లూరు నగరాభివృద్ధికి విఘాతం కలిగించేలా డివిజన్ల పునర్విభజన ప్రక్రియ చేపట్టడం సరికాదు. అస్తవ్యస్తంగా జరిగిన ఈ ప్రక్రియలో తక్షణమే మార్పులు చేయాలి’ అని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన పార్టీ నాయకులతో కలిసి ఆదివారం ఎన్‌ఎంసీ కార్యాలయంలో కమిషనర్ నందన్‌ను కలిశారు. డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియలో తలెత్తుతున్న అభ్యంతరాలను తెలియజేసి రాతపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. అనంతరం పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయా డివిజన్లలో సరిహద్దులను నిర్ణయించడంలో స్పష్టత లోపించిందన్నారు. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని డీలిమిటేషన్ ప్రక్రియలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేయాలని కోరారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియను కార్పొరేషన్ అస్తవ్యస్తం చేసిందన్నారు. కొన్ని డివిజన్లలో కొంత ఏరియాను తీసి దూరంగా ఉన్న ఇంకో ప్రాంతంలో కలపడం ద్వారా ప్రజలు గందరగోళానికి గురయ్యే పరిస్థితి తలెత్తిందన్నారు. ఇది ప్రజల్లో ఉన్న ఐక్యతను దెబ్బతీయడమేనన్నారు. అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే నగర నియోజకవర్గంలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ దారుణంగా జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేసినా ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అందులో సూచించిన విధంగా మార్పులు చేసి నగరపాలక సంస్థ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని కోరారు. తాము సూచించిన విధంగా సరిహద్దుల మార్పు చేపట్టకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జిలు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు, ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు.


