కడివేడు భూములపై విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

కడివేడు భూములపై విచారణ చేపట్టాలి

May 25 2026 12:23 AM | Updated on May 25 2026 12:23 AM

ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌ డిమాండ్‌

చిల్లకూరు: కడివేడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి భూ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ డిమాండ్‌ చేశారు. గూడూరులోని సనత్‌నగర్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడివేడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములపై నెలకొన్న అనిశ్చితిని తొలగించి, పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ఉన్నతాధికారులు చొరవ చూపి పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలివ్వాలని కోరారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 2,395 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఇందులో దాదాపు 900 ఎకరాల వరకు ప్రైవేట్‌ వ్యక్తుల పేరిట నమోదైనట్లు సమాచారం వస్తోందన్నారు. ఆ భూములు రెవెన్యూ రికార్డుల్లో ఏ విధంగా నమోదయ్యాయో, వారికి హక్కులు ఎలా కల్పించారో స్పష్టం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

కూటమి ప్రభుత్వంలో..

పేదలకు చెందాల్సిన భూములు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దల చేతుల్లోకి వెళుతున్నాయని మురళీధర్‌ ఆరోపించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా స్థానిక ప్రజాప్రతినిధులు తమ అనుచరులకు ప్రభుత్వ భూములు కట్టబెట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. ప్రస్తుతం కూడా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న విలువైన ప్రభుత్వ భూములపై కూటమి నాయకులు కన్నేశారని, గత తహసీల్దార్‌ సహకారంతో రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్లు చేయించుకుని భూములను సొంతం చేసుకుంటున్నట్లు సమాచారం ఉందన్నారు. ఈ అంశంపై ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో, అసలు భూ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే 700 ఎకరాల్లో ప్లై ఉడ్‌ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని ప్రకటించారని విమర్శించారు. కడివేడు భూముల వ్యవహారంలో నిజాలను వెలికితీసేందుకు ప్రయత్నించిన ఆర్డీఓ సత్యనారాయణను రికార్డులు బయటకు తీయకముందే బదిలీ చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో కూటమి నాయకుల ప్రమేయం ఉందనే విషయం స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి కడివేడు భూముల వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఈ అంశంపై కలెక్టర్‌ను కలిసి ఆధారాలతో కూడిన నివేదిక అందజేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement