జిల్లా వ్యాప్తంగా కార్డెన్‌ సెర్చ్‌లు | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా కార్డెన్‌ సెర్చ్‌లు

May 25 2026 12:23 AM | Updated on May 25 2026 12:23 AM

నెల్లూరు(క్రైమ్‌): నేరాల కట్టడి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌ అధికారులు జిల్లా వ్యాప్తంగా కార్డెన్‌ సెర్చ్‌లు నిర్వహిస్తున్నారు. ఆదివారం వివిధ ప్రాంతాల్లో జరిగాయి. శివారు, నేరాలు జరిగేందుకు అవకాశమున్న ప్రాంతాల్లో అధికారులు బృందాలుగా విడిపోయి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు?, వారు ఏ ప్రాంతానికి చెందిన వారు?, ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు?, ఏం చేస్తున్నారు తదితర వివరాలను సేకరించడంతోపాటుగా వారి ఆధార్‌కార్డులను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. వారి వేలిముద్రలను పరిశీలిస్తున్నారు. నేర ప్రవృత్తి లేదని తెలిస్తే విడిచి పెడుతున్నారు. పత్రాలు సక్రమంగా లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలిస్తున్నారు. రౌడీ, సస్పెక్ట్‌ షీటర్లకు తమదైన శైలిలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. స్థానికులతో మమేకమై అక్కడి సమస్యలను తెలుసుకుంటున్నారు. మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని, సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. శక్తి యాప్‌, ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సేవలు తదితరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఐదురోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా వివిధ స్టేషన్ల పరిధిలో కార్డెన్‌ సెర్చ్‌లు నిర్వహించి వాహనపత్రాలు సక్రమంగా లేని 264 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, నాలుగుకార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 27 మందికి ఫిన్స్‌ హాయంతో వేలిముద్రలు సేకరించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యక్రమాలు, మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా తదితరాలను గుర్తిస్తే వెంటనే డయల్‌ 112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు ప్రజలకు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement