పేదల చెమట చుక్కలను అధికార పార్టీ నేతలు నకిలీ హాజరుతో నోట్ల కట్టలుగా మార్చుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదల ఆకలి తీర్చాల్సిన ఉపాధి హామీ పథకాన్ని
పందికొక్కుల్లా దిగమింగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పారదర్శకత కోసం తెచ్చిన ముఖ హాజరు వ్యవస్థనే మాయాజాలంగా మార్చేసి, ఏసీ గదుల్లో విలాస జీవితాలు అనుభవిస్తున్న టీడీపీ నేతల కుటుంబాలను కూలీలుగా చూపించి ప్రజాధనాన్ని రూ.లక్షల్లో కాజేస్తున్నారు. సాక్షాత్తు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల పచ్చనేతలు ఈ అక్రమాలకు బరి తెగించారు.
పనులు తక్కువ.. కూలీలు ఎక్కువ
ఉపాధి హామీ పథకం కింద చేజర్ల మండలంలో చేసే పనులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో కూలీల హాజరు ఉండడంతో ఈ నకిలీ వ్యవహారం బట్టబయలు అవుతుంది. చేజర్ల మండల వ్యాప్తంగా 22 గ్రామ పంచాయతీల్లో 34 పనులు జరుగుతుండగా సుమారు 11 వందల మందికి పైగా కూలీలు నమోదు అవుతున్నారంటే నకిలీ కూలీలు వీళ్లల్లో ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. గ్రామంలో లేని వారిని దీర్ఘకాలికంగా మంచానికే పరిమితమైన రోగులను సైతం ఉపాధి కూలీలుగా సృష్టించి ముందుగానే సేవ్ చేసి పెట్టుకున్న వారి ఫొటోను ప్రతి రోజు మస్తరులో నమోదు చేసి నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మండలంలో ఓ టీడీపీ నేత ఇంట్లోని కుటుంబ సభ్యులంతా పనికి వెళ్లినట్లు మస్తరు నమోదైందంటే పని చేయకుండానే ఇలాంటి మస్తర్లతో ఎంత నగదు అక్రమార్కుల ఖాతాల్లోకి వెళుతుందో ఇట్టే అర్థమవుతోంది.
చేజర్లలో ముఖ హాజరు మాయాజాలం
టీడీపీ జిల్లా స్థాయి నేతలు, వారి కుటుంబ సభ్యులు కూలీలే
పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే
ముఖ హాజరు నమోదు
పని ప్రదేశం లొకేషన్ సైతం మార్పు
ఆదివారం, సెలవు
రోజుల్లోనూ మస్తర్లు


