నెల్లూరురూరల్: జిల్లాలోని నాలుగు ఎంఎస్‌ఎంఈ పార్కులకు సోమవారం శంకుస్థాపనలు జరగనున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడులో 14.47 ఎకరాలు, కావలి నియోజకవర్గం దగదర్తి మండలం ఉలవపాడులో 21 ఎకరాలు, ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలంలో 22.43 ఎకరాలు, గూడూరు నియోజకవర్గం కడివేడులో 20 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కుల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
అడవిలో అగ్నికీలలు
మర్రిపాడు: మండలంలోని కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు వేయడంతో మంటలు చెలరేగాయి. నెల్లూరు– వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దు సమీపంలో చెలరేగిన ఈ మంటలు వేగంగా వ్యాపిస్తూ విలువైన అటవీ సంపదను దహనం చేస్తున్నాయి. ఎండల తీవ్రత, గాలుల కారణంగా మంటలు మరింత విస్తరిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవిలోని చెట్లు, పొదలు, చిన్న మొక్కలు మంటలకు ఆహుతవుతుండగా దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. దీంతో నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై పొగ వ్యాపించడంతో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. మంటలు అదుపు తప్పి మరింత విస్తీర్ణానికి వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి అగ్నిమాపక చర్యలు చేపట్టాలని, అడవికి నిప్పంటించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


