సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి నెల్లూరు రూరల్‌లో రాజకీయంగా ఎదిగి మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరడంతో ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డి సైతం అన్న బాటలోనే నడిచారు. ఎమ్మెల్యేకు ఇటీవల ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో వచ్చే దఫా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. ఆయన స్థానంలో సోదరుడు గిరిధర్‌రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీలోని క్యాడర్ మొత్తం అనుకున్నారు. ఈ క్రమంలో పార్టీ పరంగా, పాలనా పరంగా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. గిరిధర్‌రెడ్డి సైతం షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారు. అధికారుల సమావేశాల్లో కూడా కొలువు తీరేవారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఆయన్ను ఎమ్మెల్యేగా భావించి రెడ్‌కార్పెట్ పరిచిన సందర్భాలు ఉన్నాయి. అంతా సాఫీగా జరుగుతున్న క్రమంలో శ్రీధర్‌రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి పొలిటికల్ ఎంట్రీ ప్రకటన చేయడంతో రాజకీయంగా కలకలం రేపింది. రామలక్ష్మణుల్లా మసులుకునే అన్నదమ్ముల మధ్య విభేదాలు, అంతరాలు పెరిగాయా? లేదా తండ్రి రాజకీయ వారసత్వ రాజకీయాల్లోకి తనకు అవకాశం కల్పించాలని కుమార్తె నుంచి ఒత్తిడి పెరిగిందా? ఇలా.. అనేక రకాలుగా చర్చలు జరుగుతుండగా, అనేకనేక ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోదరుల మధ్య విభేదాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.


