సంగం: మండలంలోని మర్రిపాడు సమీపంలో చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని స్థానికుల సమాచారం మేరకు శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా వ్యర్థాలతో నిండిన 80 డ్రమ్ములు గుర్తించారు. సంబంధిత అధికారుల సమక్షంలో వాటిని నిర్వీర్యం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా నాకాబందీ
● డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ
మద్య సేవనంపై 49 కేసులు
నెల్లూరు(క్రైమ్): నేర నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, హైవే ప్రవేశ, నిష్క్రమణ, శివారు ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేశారు. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వారిపై 19 కేసులు, బహిరంగ మద్య సేవనంపై 30 కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని వాహనదారులపై ఎంవీయాక్ట్ కింద 513 కేసులు నమోదు చేసి రూ.1,47,860 జరిమానా విధించారు. జిల్లాలోని 87 లాడ్జీల్లో తనిఖీలు చేశారు. రికార్డులను పరిశీలించి, బసచేసిన వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
మృతురాలి పేరిట
పెన్షన్ స్వాహా
● వార్డు వెల్ఫేర్ సెక్రటరీ సస్పెన్షన్
బుచ్చిరెడ్డిపాళెం: సామాజిక పెన్షన్లలో భారీ అక్రమం బుచ్చిరెడ్డిపాళెంలో వెలుగుచూసింది. మృతిచెందిన వృద్ధురాలి పేరిట ప్రతినెలా వస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్‌ను అక్రమంగా డ్రా చేస్తూ ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన ఘటన తాజాగా బయటపడింది. పురపాలక సంఘం పరిధిలోని ఇసుకపాళెం–1 సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న జొన్నవాడ రాజశేఖర్ అనే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. అదే వార్డుకు చెందిన షేక్ ఇమామ్ బీ అనే వృద్ధురాలు కొంతకాలం క్రితమే మరణించినప్పటికీ, ఆమె వివరాలను అధికారిక రికార్డుల్లో నమోదు చేయకుండా గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న సదరు ఉద్యోగి.. మృతి చెందిన మహిళ పేరిట కొనసాగుతున్న పెన్షన్‌ను నెలనెలా డ్రా చేస్తూ వచ్చాడని అధికారులు గుర్తించారు. జూలై 2023 నుంచి మే 2026 వరకు దాదాపు 35 నెలల పాటు పెన్షన్ నగదును అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు నిర్ధారించారు. ఈ వ్యవధిలో మొత్తం రూ.1,28,000 వరకు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైనట్లు వెల్లడైంది. దీంతో అధికారులు రాజశేఖర్‌ను సస్పెండ్ చేశారు.
బస్సు చక్రాల కింద
నలిగిన ప్రాణం
నెల్లూరు(క్రైమ్): ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగి వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లా కోర్టు సమీపంలోని చైనాబజార్ వద్ద శనివారం చోటుచేసుకుంది. సౌత్‌ట్రాఫిక్ పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని సరస్వతీనగర్‌లో సత్యనారాయణ(62), శ్రీలత దంపతులు నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ చిన్నబజారులో బంగారు దుకాణం నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం ఆయన ఏసీ మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేశారు. అనంతరం బైక్‌పై ఇంటికి బయలుదేరారు. చైనా బజారు వద్దకు వచ్చేసరికి కూరగాయల మార్కెట్ వైపు నుంచి బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ హ్యాండిల్‌కు తగలడంతో అదుపుతప్పి సత్యనారాయణ కిందపడ్డారు. బస్సు వెనుక చక్రం అతని తలపైకి ఎక్కడంతో నుజ్జునుజ్జై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఎస్సై మాల్యాద్రి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పొదలకూరు నిమ్మధరలు(కిలో)
పెద్దవి: రూ.70
సన్నవి: రూ.25
పండ్లు: రూ.10


