● అధికార పార్టీ నేతల
కుట్రలను తిప్పికొట్టాలి
● పుట్టా శివశంకర్‌రెడ్డి,
ఆనం విజయకుమార్‌రెడ్డి
నెల్లూరు సిటీ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ఓట్లు తొలగించే అవకాశం ఉందని, దీనిపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుట్టా శివశంకర్‌రెడ్డి, పార్టీ రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని జీపీఆర్ గ్రాండ్‌లో శనివారం వైఎస్సార్‌సీపీ బూత్ లెవల్ ఏజెంట్స్‌తో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తొలుత జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి వారు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివశంకర్‌రెడ్డి, విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. ఈ క్రమంలో అధికార పార్టీ కుట్రపూరితంగా వైఎస్సార్‌సీపీ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లు తొలగించే అవకాఽశం ఉందని తెలిపారు. అక్రమాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికార పార్టీ నేతల కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రూరల్ నాయకులు, కార్పొరేటర్‌లు, బీఎల్‌ఏలు, డివిజన్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న పుట్టా శివశంకర్‌రెడ్డి, పక్కనే ఆనం విజయకుమార్‌రెడ్డి, అరుణమ్మ, పాల్గొన్న బీఎల్‌ఏలు, పార్టీ నేతలు


