● అడ్డొస్తున్నాడని మాజీ ప్రియుడి హత్య
వింజమూరు (ఉదయగిరి): ఆమె ఇద్దరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మాజీ ప్రియుడి అడ్డుతొలగించుకునేందుకు పక్కా ప్లాన్ చేసింది. ప్రస్తుత ప్రియులను పురికొల్పి ఈనెల 16న వింజమూరు వింజేటమ్మ గుడికి వెళ్లే మార్గంలో పాలవాగు వద్ద మాజీ ప్రియుడిని కడతేర్చింది. దీనికి సంబంధించిన వివరాలను వింజమూరు పోలీస్‌స్టేషన్‌లో కలిగిరి సీఐ పోతుగంటి సుబ్బారావు శనివారం వెల్లడించారు. కలిగిరి మండలం వీర్నకొల్లుకు చెందిన అవివాహితుడు మేదరమిట్ల శ్రీకాంత్‌కు, అదే మండలం నాగిరెడ్డిపాళేనికి చెందిన వితంతువు మూలే వెంగమ్మకు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ క్రమంలో ఆమె వీర్నకొల్లుకు చెందిన వాకాటి హరిబాబు, అతని మిత్రుడు ఏఎస్‌పేట మండలం కాకర్లపాడుకు చెందిన ప్రదీప్‌తో ఇటీవల వివాహేతర బంధం కొనసాగిస్తోంది. హరిబాబు ఓ పార్శిల్ సర్వీస్‌లో పనిచేస్తుండగా, ప్రదీప్ వింజమూరులో ముఠా పనులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌ను వెంగమ్మ నిర్లక్ష్యం చేయడంతో అతను తరచూ గొడవ పడేవాడు. ఈ విషయం ఆ మహిళ హరిబాబు, ప్రదీప్‌కు చెప్పి అడ్డుతొలగించుకోవాలని పురికొల్పింది. ఈ క్రమంలో ఈనెల 15న ప్రదీప్ తన జన్మదిన వేడుకలు వింజమూరులో ఓ ప్రైవేటు లాడ్జీలో వెంగమ్మ, హరిబాబుతో కలిసి జరుపుకున్నారు. అదేరోజు శ్రీకాంత్‌ను హత్య చేసేందుకు నిర్ణయించి వెంగమ్మ ఫోన్ నుంచి వింజమూరు రమ్మని పిలిచింది. కానీ శ్రీకాంత్ రాకపోవడంతో ప్లాన్ విఫలమైంది. మరుసటి రోజు శ్రీకాంత్‌కు ఫోన్ చేసి పిలవడంతో అతను తన బైక్‌లో వింజమూరు బస్టాండ్ వద్దకు వచ్చి వెంగమ్మను కలిశాడు. ఇద్దరు కలిసి వింజేటమ్మ గుడికి వెళ్లే మార్గంలో పాలవాగు అటవీ ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే ప్లాన్ ప్రకారం హరిబాబు, ప్రదీప్‌లు వేచి ఉన్నారు. నలుగురు కలిసి మద్యం సేవించారు. అనంతరం గొడవ పడ్డారు. ఈ క్రమంలో హరిబాబు కత్తితో శ్రీకాంత్‌ను పొడిచాడు. ప్రదీప్, వెంగమ్మ కలిసి ముఖంపై గుడ్డ కప్పి ఊపిరాడకుండా చేసి చంపారు. కాగా శ్రీకాంత్ 16వ తేదీ రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు మరుసటి రోజు కలిగిరి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. 19న వింజమూరులోని వింజేటమ్మ గుడికి వెళ్లే మార్గంలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడ ఉన్న బైక్ ద్వారా మృతుడిని గుర్తించారు. సాంకేతికత ఆధారంగా నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా జడ్జి రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన కలిగిరి, వింజమూరు ఎస్సైలు ఉమాశంకర్, మాదాల ఉమామహేశ్వరరావులతో పాటు సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.


