కొడవలూరు: ప్రమాదవశాత్తు రైల్లో నుంచి ఓ వ్యక్తి పడిపోయి తీవ్రంగా గాయపడగా, ఆర్‌పీఎఫ్, 108 సిబ్బంది సకాలంలో కాపాడిన ఘటన మండలంలోని రామన్నపాళెం రైల్వేగేట్ సమీపంలో శనివారం జరిగింది. ఆత్మకూరు మండలం దేపూరుకు చెందిన సీహెచ్ నవీన్‌కుమార్ సొంత పనిపై కావలి వచ్చి అక్కడి నుంచి రైల్లో నెల్లూరు వెళ్తుండగా రామన్నపాళెం గేట్ సమీపంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయారు. తీవ్రగాయాలతో ఉండడాన్ని గుర్తించిన రైల్వే గేట్ సిబ్బంది ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు 108కు సమాచారం అందించారు. రామన్నపాళెం రైల్వేగేట్ వద్ద నుంచి అర కిలోమీటరు దూరంలో ఘటనా స్థలానికి 108 అంబులెన్స్ ఈఎంటీ విజయ్, పైలట్ మహేష్‌లు, ఆర్పీఎఫ్ సిబ్బంది సాయంతో వెళ్లి క్షతగాత్రుడ్ని స్ట్రెచర్‌పై మోసుకొచ్చి నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నవీన్‌కుమార్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపినట్లు 108 సిబ్బంది వెల్లడించారు.


