రొయ్యకు సన్‌ స్ట్రోక్‌ | - | Sakshi
Sakshi News home page

రొయ్యకు సన్‌ స్ట్రోక్‌

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

45 డిగ్రీలకు తగ్గని ఉష్ణోగ్రతలు

చిల్లకూరు: డాలర్ల పంట ఆక్వా సాగును కష్టాలు వెంటాడుతున్నాయి. ఒక వైపు ఫీడ్‌ ధరలు ఇష్టారీతిన పెరగడం, మరో వైపు నాసిరకం సీడ్‌ అంటకట్టడం, ఇంకో వైపు కూటమి ప్రభుత్వం పలు రకాలుగా భారాలు మోపుతుంటే.. అన్ని వైపుల నుంచి ప్రకృతి పగబడుతోంది. వేసవి సీజన్‌లో ఆక్వా సాగు చేస్తే వైరస్‌లు తక్కువగా ఉంటాయని, రొయ్యల ఎదుగుదల (గ్రోత్‌) బాగా ఉంటుందని, నాణ్యతను బట్టి మంచి ధరలు ఉంటాయని సాగుదారులు ఏప్రిల్‌లో సాగు చేపట్టి జూన్‌ నెలాఖరుకు హార్వెస్ట్‌ చేస్తుంటారు.

సాగుకు ప్రతికూల పరిస్థితులు

ఈ ఏడాది ఏప్రిల్‌లో చేపట్టిన ఆ వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక అధిగ ఉష్ణోగ్రతల కారణంగా రొయ్యలకు సన్‌ స్ట్రోక్‌ (వడ దెబ్బ) తగులుతుండడంతో సాగుదారులు లబోదిబోమంటున్నారు. మే నెల ఆరంభంలో కూడా వేడి పెద్దగా లేక పోయినా గుంతల్లో 24 గంటలూ ఏయిరేటర్లు తిప్పతూ రొయ్యలకు ఆక్సిజన్‌తోపాటు చల్లదనం అందిస్తున్నారు. అయితే గత పది రోజుల నుంచి ఎండ తీవ్రత 45 డిగ్రీలకు తగ్గడం లేదు. ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతల దెబ్బకు రొయ్యలు ఎర్రగా మారి పోయి వైరస్‌ వచ్చిన రీతిలో చనిపోతున్నాయి. పశ్చిమాసియా దేశంలో యుద్ధం నేపథ్యంలో రొయ్యల ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో టైగర్‌, వెనామీ సాగుదారులు దేశీయ మార్కెట్‌లోనే విక్రయాలు చేసుకుంటున్నారు. దీంతో ఇక్కడ ఎగుమతిదారులు చెప్పిన ధరలకే విక్రయాలు చేస్తుండడంతో నష్టపోతున్నామని ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు సన్‌ స్ట్రోక్‌ కారణంగా 60, 40 కౌంట్‌ రొయ్యలు చని పోతుండడంతో పెట్టిన పెట్టబడులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో లబోదిబోమంటున్నారు.

జిల్లాలో 60 వేల ఎకరాల్లో ఆక్వా సాగు

జిల్లాలోని సముద్ర తీర ప్రాంత మండలాల్లో సుమారు 60 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేపడుతుండగా ఒక్క గూడూరు నియోజకవర్గంలోనే సుమారుగా 20 వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది. ఇందులో కండలేరు క్రీక్‌ (ఉప్పు టేరు) నీటిని ఆధారంగా చేసుకుని ఎక్కువ శాతం మంది రైతులు సాగు చేపడుతున్నారు. కండలేరు క్రీక్‌కు అటు ఇటుగా రొయ్యల గుంతలు సాగులో ఉండడంతో పట్టుబడి చేసిన వారు గుంతల్లోని నీటిని మరలా క్రీక్‌లోకే వదలేస్తుండడంతో క్రీక్‌లో నీరు కలుషితమై ఉప్పు శాతం తగ్గి పోతుంది. దీంతో రొయ్యల ఎదుగుదలపై ప్రభావం పడి రొయ్యలు మధ్యలోనే వైరస్‌ల బారిన పడి చనిపోతున్నారు. దీంతో ఆక్వా సాగుదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

తక్కువ కౌంట్‌లోనే చనిపోతున్న రొయ్యలు

ఉప్పు శాతం పెరిగిపోతున్న వైనం

ఆక్వా సాగును

ఆదుకోవాలని రైతుల ఆవేదన

ఖర్చులు పెరిగిపోతున్నాయి

ఈ ఏడాది ఆక్వా సాగులో ఖర్చులు అధికమవుతున్నాయి. ఒక వైపు సీడ్‌, ఫీడ్‌ ధరలను అమాంతం పెంచేయడంతో గతేడాది కన్నా ఈ ఏడాది 20 శాతం ఖర్చులు పెరిగాయి. దీనికి తోడు వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఒక వైపు వైరస్‌లు వ్యాప్తి చెందుతుండగా, మరో వైపు ఎప్పుడు లేని ఎండ తీవ్రత రొయ్యలపై పడుతుండడంతో రొయ్యలకు సన్‌ స్ట్రోక్‌ తగి ఎర్రగా మారి చనిపోతున్నాయి. మూలిగే నక్క మీద తాటి పండు పడిన చందంగా ఆక్వా సాగుదారుల పరిస్థితి మారింది. ఆక్వా సాగుదారులకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకోవాలి.

– జయశేఖరరెడ్డి ఆక్వా రైతు, తిక్కవరం, చిల్లకూరు మండలం

Advertisement
 
Advertisement
Advertisement