అవినీతి మత్తు.. నిద్రావస్థలో నిఘా | - | Sakshi
Sakshi News home page

అవినీతి మత్తు.. నిద్రావస్థలో నిఘా

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

నెల్లూరు (బారకాసు): నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కొద్ది రోజులుగా కార్పొరేషన్‌ స్థలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాలు మితిమీరాయి. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వీరి అండదండలతో జరుగుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. నగర పాలక సంస్థ పరిధిలో పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నా.. సదరు యజమానుల నుంచి అడిగినంత ముట్టితే చాలు అటు వైపు కన్నెత్తి చూడకుండా మిన్నకుండిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 150 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించిన నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 1,83,643 భవనాలుండగా ఇందులో అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, షాపింగ్‌ మాల్స్‌ దాదాపు 8 వేలకు పైగా ఉన్నాయి. ఇక బహుళ అంతస్తుల భవనాలు దాదాపు 25 వేలకు పైగా ఉన్నాయి. నెలకు కనీసం 20 భవనాలకు ప్లాన్‌ అప్రూవల్‌కు దరఖాస్తులు కార్పొషన్‌కు వస్తుంటాయి. వీటిలో రోజుకు రెండూ లేదా మూడు భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తుంటారు. భవన అనుమతుల ద్వారా కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయం కంటే టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు రాబడే అధికంగా ఉంటుంది.

అక్రమ నిర్మాణాల్లో కొన్ని..

నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కు రోడ్డులో జాతీయ రహదారి కలిసే కూడలిలో దాదాపు ఆరేళ్ల క్రితం ఓ బహుళ అంతస్తుల భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. ఆ భవన ప్లాన్‌లో ఒకలా ఉంటే.. నిర్మాణం మరోలా ఉంది. ప్లాన్‌లో జీప్లస్‌ 2కు అనుమతి తీసుకుని జీప్లస్‌ 4గా నిర్మించారు. అదనంగా రెండు ఫోర్లు నిర్మించినా.. దీనిపై సంబంధిత టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నేటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్లాన్‌ లేకుండా అదనపు అంతస్తులు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం బీపీఎస్‌ స్కీం ద్వారా రెగ్యులరైజ్‌ చేసుకోమని అవకాశం కల్పించినా సదరు యజమాని వినియోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

● నగరంలోని బృందావనం ప్రాంతంలో రైల్వేట్రాక్‌ పక్కన ఉన్న స్థలాలు బఫర్‌ జోన్‌ కిందకు వస్తాయి. అటువంటి స్థలంలో నిర్మాణాలు చేపట్టకూడదు. ఒక వేళ ఎవరైనా నిర్మాణాలు చేపట్టాలంటే సంబంధిత రైల్వే అధికారుల నుంచి ఎన్‌ఓసీ సర్టిఫికెట్‌ తెచ్చుకుని అప్పుడు ప్లాన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ప్లాన్‌ మంజూరు చేస్తారు. దీంతో సంబంధిత యజమాని భవన నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటిది ప్రస్తుతం బృందావనంలోని రైల్వే ట్రాక్‌ సమీపంలోని బఫర్‌ జోన్‌లో ఓ భవన నిర్మాణం చేపడుతున్నారు. ఈ భవనానికి టౌన్‌ ప్లానింగ్‌ నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అయినా సంబంధిత యజమాని యథేచ్ఛగా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మిన్నకున్నారు. ఇందుకు కారణంగా కింది స్థాయి నుంచి టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల వరకు ఎవరి వాటా వారికి ముట్టుతుండటమేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి ఉదాహరణలు కార?్పరేషన్‌ పరిధిలో కోకొల్లలున్నాయి. ఇకనైనా సంబంధిత టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

బృందావనంలోని బఫర్‌ జోన్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనం

నగరంలో జరుగుతున్న భవన నిర్మాణాలపై నిఘా ఉంచాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అవినీతి మత్తుతో నిద్రావస్థలో ఉంటున్నారు. ఎక్కడా కూడా తనిఖీలు చేపడుతున్న దాఖలాలు లేవు. దీంతో అక్రమ నిర్మాణదారులు తమ ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక వేళ ఎవరైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తే వారి ఆదేశాల మేరకు నామమాత్రపు చర్యలు చేపట్టి, సదరు అక్రమ నిర్మాణదారుల నుంచి అందినకాడికి దండుకుని మిన్నకుండి పోతున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపించడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement