● సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య
నెల్లూరు (టౌన్): జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. శనివారం ఆయన జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు తొలి విడతలో 642, రెండో విడతలో 85 ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారని, వాటిల్లో 342 ప్లాంట్లు మరమ్మతులకు గురయ్యాయని, ఈ నెలాఖరుకు మరమ్మతులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో అవసరమైన చోట మేజర్, మైనర్ రిపేర్స్, టాయిలెట్స్, పెయింటింగ్, డ్యూయల్ డెస్కులు, కొత్త ఆర్పో ప్లాంట్లు ఏర్పాటు పనులను ఏడాది లోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారన్నారు. ఇందుకు సంబంధించి రూ.55 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఇప్పటికే పేరెంట్స్ కమిటీ అకౌంట్లలో రూ.9 కోట్లు ఉన్నాయన్నారు. త్వరలో కమిటీల ద్వారా ఆయా మోడల్ ప్రైమరీ స్కూల్స్‌ల్లో అవసరమైన వసతులపై ఎస్టిమేట్ వేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో నెల్లూరులోని కేఎన్నార్ మున్సిపల్ హైస్కూల్, కావలి మండలం ఒట్టూరులోని మోడల్ హైస్కూల్, బుచ్చిరెడ్డిపాళెంలోని డీఎల్‌ఎన్‌ఆర్ గర్‌ల్స్ హైస్కూల్, వింజమూరులోని జెడ్పీ బాలుర హైస్కూల్, ఆత్మకూరులోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, కందుకూరులోని గర్‌ల్స్ హైస్కూల్‌లో అటీజం సెంటర్లను ఏర్పా టు చేస్తున్నామన్నారు. ఒక్కో స్కూల్‌కు రూ.40 లక్షలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 87,689 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 44,476 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.29 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


