ఇరిగేషన్‌ పనుల పేరుతో భారీ దోపిడీ | - | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్‌ పనుల పేరుతో భారీ దోపిడీ

May 18 2026 12:06 AM | Updated on May 18 2026 12:06 AM

పనులు చేయకుండానే సోమిరెడ్డి స్వాహా

క్షేత్రస్థాయికి వెళ్తే బండారం బట్టబయలు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ముత్తుకూరు(పొదలకూరు): ఇరిగేషన్‌ పనుల పేరుతో కాలువల్లో పూడికలు తొలగించకుండా టీడీపీ నాయకులు సోమిరెడ్డి ఆధ్వర్యంలో భారీ దోపిడీకి పాల్పడినట్టు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని జంగాలకండ్రిక జంక్షన్‌ వద్ద ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాలకు సాగునీరందించే పలు కాలువలను ఆదివారం రైతులతో కలిసి కాకాణి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున రైతులు హాజరై పంట కాలువల వల్ల పడుతున్న ఇబ్బందులను కాకాణి దృష్టికి తీసుకెళ్లారు. జంగాలకండ్రిక కాలువ గట్టుపై నివాసముంటున్న గిరిజన కుంటుంబాల వారు కలిసి సంక్షేమ పథకాలు తమకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ జిల్లాలో ఇరిగేషన్‌ పనులను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు దోచుకుంటున్నట్టు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయకుండానే సోమిరెడ్డి అడ్డగోలుగా రూ.కోట్లు దోపిడీకి పాల్పడుతున్నట్టు ఆరోపించారు. రైతుల విజ్ఞప్తి మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అసలు కథ బయటపడుతోందన్నారు. రోడ్డు పక్కన మాత్రం కాలువలను రిపేర్లు చేసినట్టు తెలిపారు. అవినీతికి పాల్పడటంలో ఇన్ని రకాలు ఉంటాయనేది సోమిరెడ్డికే తెలుసన్నారు. మోంథా తుఫాను నష్ట నివారణా చర్యల్లో భాగంగా కలెక్టర్‌ ఆమోదించిన పనులు చేయకుండానే దొంగ బిల్లులు చేసుకున్నట్టు ఆరోపించారు. కాలువలకు నీళ్లు వదిలిన తర్వాత సోమిరెడ్డి పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకున్నట్టు విమర్శించారు.

అధికారులు విచారణ ఎదుర్కోవాలి

తాము సేకరించిన ఆధారాల ప్రకారం ఒకే పనిని మూడు, నాలుగు రకాలుగా చూపుతూ బిల్లులు చేశారని సంబంధిత అధికారులు విచారణను ఎదుర్కోక తప్పదని కాకాణి పేర్కొన్నారు. పని జరిగే ప్రాంతం ఒకటే అయినా పేర్లు మార్చి మోసాలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. కనుపూరు కాలువ మనుషులతో చేయించాలని కి.మీ పనులకు రూ.10 లక్షల వంతున అంచనా వేసి డోజర్‌ (జేసీబీ)తో కాలువకు ఇరువైపులా మట్టిని నెట్టి పూడికతీత పనులు పూర్తి చేసినట్టు దొంగ బిల్లులు సృష్టించి దోచుకున్నట్టు చెప్పారు. ప్రతి సీజన్లో రైతులే కాలువల పనులు చేపడుతున్నారని ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లు వచ్చి పనులు చేసింది లేదని వెల్లడించినట్టు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సోమిరెడ్డి ముఠా చేస్తున్న దోపిడీని ఆధారాలతో సహా చూపుతున్నామని, దమ్ము, ధైర్యం ఉంటే కాలువల వద్దకు వారు రావాల్సిందిగా సవాల్‌ విసిరారు. సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వంలో కాలువల పనులను ముమ్మురంగా చేపట్టినట్టు వెల్లడించారు.

నీరు – చెట్టును పోలిన అవినీతి

2014 – 19 మధ్య టీడీపీ నేతలు నీరు – చెట్టు పథకంలో ఎలాగైతే దోచుకున్నారో ఇప్పుడు కూడా అదే తరహాలో దోపిడీకి పాల్పడుతున్నట్టు కాకాణి తెలిపారు. గతంలో జరిగిన పనులకు విజిలెన్స్‌ విచారణ పేరుతో సాగదీస్తున్నారని ఇప్పటి వరకు నివేదిక బయటకు రాలేదన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్‌ రిపేర్లకు గతంలో రూ.12 కోట్లు మంజూరైతే ఆ పనులు పూర్తి కాకుండానే ఇప్పుడు మరో రూ.50 కోట్లు దోపిడీకి సోమిరెడ్డి తెరలేపినట్టు విమర్శించారు. ఇరిగేషన్‌ పనులపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తే అన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నారు. షట్టర్లు బిగించడంలో అవినీతి జరిగిందని సోమిరెడ్డి గగ్గోలు పెట్టి కమీషన్లు దండుకున్నట్టు తెలిపారు. దొంగ బిల్లులు చేసే అధికారులు మాత్రం విచారణను ఎదుర్కొని ఇబ్బందులకు గురికాక తప్పదన్నారు. ఇరిగేషన్‌ మంత్రి రామానాయుడు కమీషన్లు దండుకోవడం మానేసి వాస్తవాలపై విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్‌ చేశారు. కాకాణి వెంట మండల పార్టీ కన్వీనర్‌ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ సుగుణ, నెల్లూరు శివప్రసాద్‌, రైతులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement