రెండేళ్లలో 7,685 మంది లబ్ధిదారులకు మొండి చేయి | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో 7,685 మంది లబ్ధిదారులకు మొండి చేయి

May 18 2026 12:06 AM | Updated on May 18 2026 12:06 AM

నెల్లూరు (వేదాయపాళెం): మత్స్యకారులకు సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలైంది. ఏటా గంగపుత్రులకు వేట నిషేధ కాలంలో మత్స్యకార భరోసాగా రూ.20 వేలిస్తామని హామీ ల్చిన చంద్రబాబు.. తొలి ఏడాది ఎగనామం పెట్టారు. రెండో ఏడాదిలో ఈ పథకాన్ని అమలు చేసినా.. గతంలోని లబ్ధిదారుల సంఖ్యను భారీగా కుదించారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంటలో ఈ నెల 19న చంద్రబాబు ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా అందించనున్న లబ్ధిదారుల జాబితాలో పలువురి అర్హుల ఏరివేత ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

అలవికానీ హామీలిచ్చి.. ఆరు దశల వెరిఫికేషన్‌తో..

అధికారంలోకి వచ్చేందుకు ఆర్భాటపు ప్రకటనలు, అలవికాని హామీల్చినా చంద్రబాబు సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చే విషయంలో సవాలక్ష నిబంధనలు విధించి అర్హులను నిర్ధాక్షిణ్యంగా తొలగించి దగా చేస్తోంది. లబ్ధిదారులను భారీగా కుదించేందుకు.. వేట నిషేధం ప్రారంభమయ్యే రోజు ఏప్రిల్‌ 14వ తేదీ నాటికి లైసెన్స్‌ రెన్యూవల్‌ అయి ఉండాలని, వేట చేసే బోటుకు జరిమానా విధించి ఉండకూడదని నిబంధనలు పెట్టింది. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ భరోసా వర్తిస్తుందని, వేట చేసే మత్స్యకారుడికి 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని, లబ్ధిదారుల కుటుంబంలో ఎవరైనా సరే సామాజిక పింఛన్‌ తీసుకుంటుంటే ఆ కుటుంబానికి ఈ పథకం వర్తించదని, విద్యుత్‌ 200 యూనిట్లు కంటే ఎక్కవ వాడకూడదని, నాలుగు చక్రాల వాహనం ఉండకూడదంటూ, మోటారైజ్డ్‌ బోటులో ఆరుగురు, సంప్రదాయ పడవలో ముగ్గురు మాత్రమే వేట సాగిస్తూ ఉండాలంటూ చివరాఖరులో నిబంధనలు పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 13,108 మంది మత్స్యకారులు మత్స్యకారుల సేవలో పథకానికి గంపెడాశతో దరఖా స్తు చేసుకున్నారు. అయితే ఆరు దశల పరిశీలన (సిక్స్‌ స్టేజ్‌ వెరిఫికేషన్‌)లో వివిధ సాకులు చూపించి 1,464 మంది దరఖాస్తులను తిరిస్కరించింది. చివరకు 11,644 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది.

మత్స్యకారుల సేవలో 7,685 మంది లబ్ధిదారులకు కోత

వైఎస్సార్‌సీపీ పాలనలో 19,329 మందికి లబ్ధి

కూటమి ప్రభుత్వంలో

తొలి ఏడాది భరోసా ఎగనామం

రెండో ఏడాది అమలు చేసినా..

12,192 మందికే సాయం

మూడో ఏడాదిలో భారీగా లబ్ధిదారుల కుదింపు

గతేడాది లబ్ధి పొందిన 548 మంది ఈ ఏడాది అర్హుల జాబితా నుంచి ఔట్‌

11,644 మందిని అర్హులుగా తేల్చిన చంద్రబాబు సర్కారు

గత ప్రభుత్వం ఎంతో ఘనం

గత సర్కారు అన్ని వర్గాల పేదలను ఆదరించి అక్కున చేర్చుకుందని, పేదలను గుర్తించి వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిందని ప్రజలు నేటికీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకతీతంగా పేదలందరికీ అన్ని పథకాలు వర్తింప చేశారని కొనియాడుతున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకానికై నా తుది గడువు అంటూ ఉండేది కాదని, లబ్ధిదారుల జాబితా ప్రకటించి నగదు విడుదల చేసిన తర్వాత కూడా అర్హత ఉండి సాయం అందని పేదలు మరోసారి దరఖాస్తు చేసుకునే వీలు కల్పించి మరీ సాయం అందించారంటూ కీర్తిస్తున్నారు. గత నెలలో కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగు జిల్లాల మత్స్యకారుల సదస్సులో మత్స్యకారులు కలెక్టర్‌ ఎదుటే బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇది గత ప్రభుత్వ పాలనా దక్షతకు, మెరుగైన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

చంద్రబాబు అంటేనే మోసం. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆయనే. మత్స్యకారుల సేవలో పథకం ఆయన మోసానికి, వెన్నుపోటుకు అద్దం పడుతోంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నాడు మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. వేట నిషేధ కాలంలో పరిహారం అందించడంలోనూ ‘పచ్చ’ పాతం చూపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారుల ఎంపికలోనూ, పరిహారం అందించడంలోనూ ఉదారంగా వ్యవహరిస్తే.. అంతకు మించి మత్స్యకారులకు భరోసా కల్పిస్తానని తొలి ఏడాది ఎగనామం పెట్టి మోసం చేశాడు. రెండో ఏడాదికి వచ్చే సరికి అర్హులను భారీగా కుదించారు. తాజాగా మూడో ఏడాదిలో ఇంకా మరికొంత మందిని తొలగించి వెన్నుపోటు పొడిచారు.

అర్హులందరి ఖాతాలో రూ.20వేలు

ఈ నెల 19న జిల్లాలోని అర్హులైన మత్స్యకారులందరి ఖాతాల్లో రూ.20 వేలు జమ అవుతాయి. జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాము. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆరు దశల వెరిఫికేషన్‌ ప్రక్రియ తర్వాత తుదిగా 11,644 మంది లబ్ధిదారులను మత్స్యకార సేవలో పథకానికి అర్హులుగా గుర్తించాము.

– శాంతి, మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌

జిల్లాలోని కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, కోట, చిల్లకూరు తీరప్రాంత మండలాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 19,329 మంది లబ్ధిదారులకు ఏటా రూ.10 వేల లెక్కన వైఎస్సార్‌ మత్స్యకార భరోసా సాయం అందించింది. తాము అధికారంలోకి వస్తే రెట్టింపు మొత్తంలో భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పిన చంద్రబాబు తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది (గతేడాది)లో పథకాన్ని అమలు చేసినా.. 12,192 మందికే లబ్ధి చేకూర్చగా ఈ ఏడాది మరో 548 అర్హులను జాబితా నుంచి తొలగించి 11,644 మందితో లబ్ధిదారుల జాబితాను ప్రకటించడంతో మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి రెండేళ్లల్లో 7,685 మంది లబ్ధిదారులను ఏరివేయడం చంద్రబాబు సర్కారుకే దక్కుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement