● మత్స్యకార నేతల నిలదీత
కావలి: మత్స్యకారులను నిలువునా మోసం చేసిన సీఎం చంద్రబాబు మత్స్యకార సేవలో పేరుతో తుమ్మలపెంటకు వస్తున్నాడని, ఏం ముఖం పెట్టుకుని వస్తున్నావంటూ మత్స్యకార కాపు నేతలు నిలదీశారు. ఆదివా రం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సూచనలతో మత్స్యకారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకొన్న తమిళనాడు బోట్లను నీ కుమారుడు లోకేశ్, నీ పార్టీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కలిసి వదిలేసి ద్రోహం చేసిన సంగతి ఏ మత్స్యకారుడు మరిచిపోరన్నారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారులు అభివృద్ధికి, భావితరాల భవిష్యత్‌కు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కడితే.. దాన్ని మా మత్స్యకారులకు అంకితం చేయకుండా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడ్డారని ధ్వజమెత్తారు. ఇంత జరిగినా.. బోట్లు వదిలేసిన వారిపై చర్యల్లేవని, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రారంభించే విషయాన్ని స్పష్టం చేయకుండా ఇప్పుడు మత్స్యకారుల సేవలో.. పేరుతో మత్స్యకారులను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తీర ప్రాంత ప్రజలకు భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు ఎవరు వెళ్లొద్దని గ్రామాల వారీగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇప్పుడు ప్రతి మత్స్యకార గ్రామానికి వెళ్లి కార్యక్రమానికి రావాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది మత్స్యకారుల్లో విబేధాలను సృష్టించడమేనని విమర్శించారు. ఈ సమావేశంలో మత్స్యకార నాయకులు కోడూరు రాజయ్య, కొమారి రాజు, వాయిల తిరుపతి, వాయిల రాధాకృష్ణ, గోవిందస్వామి, మత్స్యకార కాపులు, మత్స్యకారులు పాల్గొన్నారు.


