20, 21న వెయిట్‌ లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

20, 21న వెయిట్‌ లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌ ఎంపికలు

May 17 2026 12:30 AM | Updated on May 17 2026 12:30 AM

నెల్లూరు (టౌన్‌): జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌ బాలుర, బాలికల జిల్లాస్థాయి ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్కే జసీమ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈనెల 20న వెయిట్‌ లిఫ్టింగ్‌ యూత్‌ అండర్‌–17 బాలురు, బాలికలు, జూనియర్‌ అండర్‌–20 పురుషులు, మహిళల ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 21న అథ్లెటిక్స్‌ అండర్‌–16, అండర్‌–20 బాలురు, బాలికలు ఎంపికలు ఉంటాయన్నారు. అనంతరం వెయిట్‌ లిఫ్టింగ్‌ రాష్ట్రస్థాయి పోటీలు ఏలూరు, అథ్లెటిక్స్‌ రాష్ట్రస్థాయి పోటీలు గుంటూరులో ఉంటాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తప్పనిసరిగా అధికార వెబ్‌సైట్‌ www.sports.ap.gov.inలో శాప్‌ లీగ్‌ పోర్టల్‌ లేదా మొబైల్‌లోని క్రీడా యాప్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 88862 28444 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

హోటల్స్‌, రెస్టారెంట్లలో తనిఖీలు

నెల్లూరు(బారకాసు): పీజీఆర్‌ఎస్‌కు అందిన ఫిర్యాదుల మేరకు నగరంలోని పలు హోటల్స్‌, రెస్టారెంట్లలో అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రత, తూనికలు–కొలతలు, పౌరసరఫరాల శాఖల అధికారులు సంయక్తంగా చేసిన దాడుల్లో మనుబోలులోని ఓ దాబాలో గడువు ముగిసిన టూటీ ఫ్రూటీ బొప్పాయి ముక్కల ప్యాకెట్లను గుర్తించి కేసు నమోదు చేశారు. నెల్లూరు హైవే వెంబడి ఉన్న దాబాలో తయారీ, ఎక్స్‌పైరీ తేదీ లేకుండా, ఫ్రిజ్‌లో నిల్వఉంచిన చేపలు, రొయ్యలు, కంజులు, బేబీ కార్న్‌ ప్యాకెట్లను గుర్తించి ధ్వంసం చేశారు. వంట గదులు అపరిశుభ్రంగా ఉండటం పట్ల మూడు దాబాలకు ఇంప్రూమెంట్‌ నోటీసులు జారీ చేశారు. ఎలక్ట్రానిక్‌ తూనిక యంత్రాలు, కొలతల పరికరాలను పరిశీలించి, ధ్రువీకరణ ముద్రల్లేని కాటాలను గుర్తించి మూడు కేసులను నమోదు చేశారు. ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ డి.నీరజ, లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ రియాజ్‌, పౌరసరఫరాల డీటీ అబ్దుల్‌ పాల్గొన్నారు.

కోళ్ల వ్యర్థాల వాహనం సీజ్‌

బుచ్చిరెడ్డిపాళెం: అనధికారికంగా కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్న వాహనాన్ని బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు శనివారం పట్టుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాళెం వైపు వస్తున్న ఓ వాహనం జొన్నవాడ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనంలో కోళ్ల వ్యర్థాలను గుర్తించడంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్‌ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

శ్రామికులకు పనులు కల్పించండి

నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీల్లో ఉద్యోగులు, సిబ్బంది కష్టపడి శ్రామికులకు ఉపాధి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్‌ ఆదేశించారు. డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఏపీఓలు, ఈసీలు, టీఏలు, ఎఫ్‌ఏలతో నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో శనివారం పీడీ మాట్లాడారు. ప్రస్తుతం ప్రతిరోజు ఉపాధి పనులకు 42 వేల మందికి పైగా శ్రామికులు హాజరవుతున్నారని, దీనిని 60 వేలకు పెంచేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రోజుకు రూ.300లు తగ్గకుండా వేతనాలు మంజూరయ్యేలా చూడాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement