● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
పొదలకూరు: పట్టణానికి సమీపంలోని సోమశిల రోడ్డు చిట్టేపల్లి చెరువులో స్థానికులు శుక్రవారం సాయంత్రం గుర్తించిన మృతదేహం పొదలకూరు రామ్‌నగర్‌గేటు సెంటర్‌కు చెందిన పడ్డాల వేమయ్య(65)గా పోలీసులు నిర్ధారించారు. అదేరోజు రాత్రి మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. వేమయ్య నలుగురిలో కలివిడిగా ఉంటూ స్థానిక గంగమ్మతల్లి దేవస్థానం గౌరవాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య మృతిచెందగా, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశారు. ఆయన ఫర్టిలైజర్స్ షాపు నిర్వహిస్తూ ఇటీవల తొలగించారు. కాగా శుక్రవారం సాయంత్రం చెరువుకు సమీపంలో కొందరు పురుగు మందుల కంపెనీలకు చెందిన వారు మాట్లాడేందుకు వేమయ్యను పిలిపించినట్టుగా తెలుస్తోంది. అక్కడ వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ మధ్యలో వేమయ్య తన కుమారుడికి ఫోన్ చేసి పురుగు మందుల కంపెనీల వారు తిరిగి వ్యాపారం ప్రారంభించాలని చెబుతున్నారని, అందుకు కావాల్సిన మందులను అందజేస్తామంటున్నారని వెల్లడించినట్టు సమాచారం. తర్వాత మృతుడి కుమారుడు ఫోన్ చేసినా స్పందించ లేదంటున్నారు. ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ వేమయ్య చెరువులో శవమై తేలడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే మృతుడు ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని, ఎన్ని సమస్యలు ఉన్నా గట్టిగా నిలబడి ఎదుర్కొనే మనస్తత్వం కలిగిన వాడంటున్నారు. దీంతో కుటుంబసభ్యులు అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. పోలీసులు సైతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


