సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దశాబ్దాలుగా పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించిన, సొంత భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో చుక్కల సమస్యకు నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాశ్వత పరిష్కారం చూపించారు. 2023 మే 12వ తేదీ కావలి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతు కుటుంబాలకు మేలు జరిగేలా 2,06,171 ఎకరాల్లోని భూములకు విముక్తి కల్పించారు. ఈ మేరకు జిల్లాలో 25 వేల మంది రైతులకు సంబంధించిన 32,270 ఎకరాలకు రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతన్నలు తిరిగే అవసరం లేకుండా, వారికి ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాలుగా క్రయవిక్రయాలకు నోచుకోని ఈ చుక్కల భూముల చిక్కులు తొలగించారు.
బ్రిటిష్ పాలకుల హయాంలో జిల్లాలో 1908 – 1920 మధ్య కాలంలో కొత్తగా భూముల రికార్డుల రూపకల్పన జరిగింది. ఆ సమయంలో భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ భూమి’ లేదా ‘ప్రైవేట్ భూమి’ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డుల్లో (రీ సెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్‌ఎస్‌ఆర్) పట్టాదారు గడిలో ’డాట్స్’ (చుక్కలు) పెట్టి వదిలేశారు. సదరు భూములే ‘చుక్కల భూములు’. తమ సొంత భూములను దశాబ్దాలుగా రైతులు అనుభవిస్తు న్నా.. వీటికి రెవెన్యూ రికార్డుల్లో సంపూర్ణ హక్కులు లేక వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బంది పడుతున్న దుస్థితి నెలకొంది. ఆ తర్వాత కాలంలో 1954 సంవత్సరానికి ముందు పేద రైతుల జీవ నాధారం కోసం భూములు కేటాయిస్తూ ప్రభుత్వం పట్టాలను మంజూరు చేసింది. ఈ భూములు సాగు చేసుకోవడానికి మాత్రమేనని, సాగుదారులకు ఎలాంటి హక్కులు ఉండవని షరతులు విధించింది. క్రయవిక్రయాలకు ఆస్కారం లేకుండా నిషేధిత జాబితా (22 ఏ) (22ఏఈ)లో చేర్చింది. అప్పటి నుంచి సాగుదారులు హక్కుల్లేక తల్లడిల్లుతున్నారు. బిడ్డల పెళ్లిళ్లు, ఆరోగ్య సమస్యలు తలెత్తి అత్యవసరమై భూములను అమ్ముకోవాల్సి వస్తే ఆ భూమిని నిషేధిత జాబితాలో నుంచి తొలగించేందుకు చాలా తతంగం ఉండేది. గత ప్రభుత్వాలు ఈ సమస్యకు పరిష్కారం చూపలేకపోయాయి.
జిల్లాలో 22,578 సర్వే నంబర్లలో 25 వేల మంది రైతులకు సంబంధించి 32,270 ఎకరాలు భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఇలాంటి భూములకు సంబంధించి రైతుల విజ్ఞప్తి మేరకు తహసీల్దార్లు ఆర్డీఓ, కలెక్టర్‌కు ప్రతిపాదించి క్షేత్రస్థాయిలో హక్కుదారుల హక్కులు పరిశీలించి పరిష్కారం చూపించే వారు. అయితే ఈ ప్రక్రియలోనూ ఏళ్ల తరబడి తిరిగి పరిష్కరించుకో వాల్సి ఉండేది. ఇందుకు రెవెన్యూ అధికారులకు అమ్యామ్యాలు సమర్పించుకుంటేనే పనులు జరిగేవి. అవి కూడా ఇచ్చుకునే స్థోమత లేని వారు మిన్నకుండిపోయారు.
2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చుక్కల భూములకు విముక్తి కల్పిస్తూ తెచ్చిన జీఓలను తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టేసింది. పాత రెవెన్యూ రికార్డుల ప్రకారం చుక్కల భూములను తిరిగి 22ఏ నిషేధిత జాబితాలో చేర్చింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు మేలు చేసేందుకు చేపట్టిన ఈ ప్రక్రియను మరో సారి గుదిబండగా మార్చి రైతులను ఇబ్బందుల పాల్జేస్తోంది. చుక్కలు చిక్కులు తొలగాయిని సంతోషిస్తున్న రైతు కుటుంబాలకు ఏడాది తిరగకుండానే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది.
నిషేధిత జాబితాలో 32,270 ఎకరాలు
మళ్లీ నిషేధిత జాబితాలోకే..
గుదిబండగా మార్చిన టీడీపీ
2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నిషేధిత భూముల యజమానుల సమస్యను మరింత గుదిబండగా మార్చింది. ఇలాంటి సమస్యకు పరిష్కారాన్ని సరళతరం చేయాల్సిన అప్పటి ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కారం చేసుకునే వీలు లేకుండా నిబంధనలు కఠిన తరం చేసింది. 2016లో రెవెన్యూ రికార్డుల ఫ్యూరిఫికేషన్ పేరుతో ఇలాంటి నిషేధిత జాబితా భూములు కాజేసేందుకు కుట్రలు చేసింది. ఏకంగా భూముల హక్కులను కాలరాసే చట్టాన్ని తెచ్చే ప్రయత్నం చేసింది. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో ఆ ప్రయత్నాన్ని విర మించుకుంది. నిషేధిత భూముల పరిష్కారానికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. గతంలో నిషేధిత జాబితాలో నుంచి భూములను తొలగించాలంటే కలెక్టర్ ఆమోదంతో పరిష్కారం అయ్యే ఈ సమస్యను ఏకంగా సీసీఎల్‌ఏ ఆమోదం తర్వాత ప్రభుత్వ ఆమోదం తెలపాలని నిబంధనలు చేర్చింది. ఆ స్థాయి వరకు వ్యయ ప్రయాసల కోర్చి వెళ్లలేక రైతులు మిన్నకుండిపోయారు. కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పుతో జిల్లా స్థాయిలో కమిటీ ద్వారా చుక్కల భూమి క్రమబద్ధీకరణ చేయాలని 2017లో జీఓ నంబర్ 216 ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అప్పటి ప్రభుత్వం దీర్ఘకాలంగా కాలయాపన చేసింది.
శాశ్వత హక్కులకు కూటమి చిక్కులు
22ఏ నిషేధిత జాబితా నుంచి భూములకు వైఎస్ జగన్ విముక్తి
జిల్లాలో 32 వేల ఎకరాలకు అడ్డంకులు తొలగించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
25 వేల మంది రైతులకు
ప్రయోజనం కల్పించిన వైనం
కూటమి అధికారంలోకి వచ్చాక
మళ్లీ నిషేధిత జాబితాలోకే..
నాటి మంత్రి కాకాణి చొరవతో..
జిల్లాకు చెందిన అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చొరవ తీసుకుని చుక్కల భూములను క్రమబద్ధీకరించి శాశ్వత హక్కులు కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాణి ఈ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెను వెంటనే పూర్తిగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిషేధిత భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక జీఓ తెచ్చింది. జిల్లా వ్యాప్తంగా 32 వేల ఎకరాలకు విముక్తి లభించింది.


