రవాణాపై పెట్రో, డీజిల్‌ పిడుగు | - | Sakshi
Sakshi News home page

రవాణాపై పెట్రో, డీజిల్‌ పిడుగు

May 16 2026 12:39 AM | Updated on May 16 2026 12:39 AM

నెల్లూరు (టౌన్‌): రవాణా రంగంపై డీజిల్‌, పెట్రోలు పిడుగు పడింది. ఇప్పటికే కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్న రవాణా వాహనదారులపై తాజాగా పెట్రోలు, డీజిల్‌ ధరలు మరింత సంక్షోభంలోకి నెట్టనున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 3.24 పైసలు, డీజిల్‌పై 3.17 పైసలు భారం మోపింది. పెరిగిన చార్జీలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రవాణా రంగం కుదేలు కానుంది. జిల్లాలో ప్రతి రోజు 3.13 లక్షల లీటర్లు పెట్రోలు, 5.68 లక్షల లీటర్లు డీజిల్‌ విక్రయం జరుగుతోంది. జిల్లాలో ఎక్కువ మంది ఆటో రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో 6 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా 4.02 లక్షలు మోటారు బైక్‌లు, 60,200 కార్లు, 13,725 అగ్రికల్చర్‌ ట్రాక్టర్లు, 22,450 ఆటోలు, 13,500 గూడ్సు క్యారియర్లతో పాటు మిగిలిన వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. ఇప్పటికే రవాణా రంగం పరిస్థితి మరింత దిగజారిపోయింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అత్యవసర వాహనాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. త్వరలో పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ. మరో 4 నుంచి రూ.5 పెంచే అవకాశం ఉందని డీజిల్‌, పెట్రోలు బంకుల యాజమానులు చెబుతున్నారు.

పెరగనున్న నిత్యావసర, రవాణా ఛార్జీలు

పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల వివిధ రకాల రంగాలపై భారం పడనుంది. ప్రధానంగా నిత్యావసర సరుకులైన పాలు, గుడ్లు, ప్రొవిజన్స్‌, కూరగాయలు తదితర వాటిపై ప్రభావం పడనుంది. వీటితో పాటు ఆటో, బస్సుల చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నిత్యావసర సరుకులు ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు వీటి ధరలు మళ్లీ పెరిగితే మరిన్ని ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లాలంటే ఎక్కువ మంది అద్దె వాహనాలపై ఆధార పడుతున్నారు. డీజిల్‌, పెట్రోలు ధరలు పెరగడంతో వాటి అద్దె ధరలు కూడా పెంచనున్నారు.

పెట్రోల్‌పై రూ.3.24, డీజిల్‌పై రూ.3.17

త్వరలో మరోసారి పెరగనున్న ధరలు

జిల్లాలో 6 లక్షలకు పైగా వివిధ రకాల వాహనాలు

ఇప్పటికే కిరాయిలు లేక ఇబ్బందులు

ఆటోలపై భారం

పెట్రోల్‌ ధరలు పెరుగుదల ఆటోలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆటోలు ఎక్కే వారు కరవయ్యారు. నగరంలో ఆటోలు ఎక్కువగా ఉన్నాయి. డీజిల్‌ పెరగడంతో చార్జీలు పెంచనిదే గిట్టుబాటు కాదు.

– రమణయ్య, ఆటో డ్రైవరు

వాహనాలను తిప్పలేం

ఇప్పటికే బాడుగలు లేక స్టాండ్‌లకే మినీ లారీలను పరిమితం చేస్తున్నాం. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగితే లారీలను తిప్పలేని పరిస్థితి ఉంటుంది. నెల్లూరు నగ రంలో మినీ లారీలు ఎక్కువగా ఉన్నాయి. ధరలు పెంచితే బాడుగలు దొరకని పరిస్థితి ఉంది. పోటీ తత్వంతో తక్కువ కిరాయితోనే బాడుగకు వెళుతున్నారు.

– శ్రీను, మినీ లారీ ఓనర్‌

Advertisement
 
Advertisement
Advertisement