సోమిరెడ్డి దోపిడీ నభూతో నభవిష్యతి | - | Sakshi
Sakshi News home page

సోమిరెడ్డి దోపిడీ నభూతో నభవిష్యతి

May 16 2026 12:39 AM | Updated on May 16 2026 12:39 AM

నెల్లూరురూరల్‌: సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు కష్టపడి, తమ సొంత డబ్బుతో కాలువలు బాగు చేసుకుంటే, ఆ పనులను తానే చేసినట్లుగా సోమిరెడ్డి బిల్లులు చేయించుకోవడం సిగ్గు చేటని, సోమిరెడ్డి చేస్తున్న దోపిడీ నభూతో నభవిష్యతి అని మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇరిగేషన్‌ పనుల పేరుతో కూటమి నాయకులు దొంగ బిల్లులు సృష్టించి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని, కుంభకోణాలు జరుగుతున్నా కలెక్టర్‌ కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. మంత్రి రామానాయుడుకు అవినీతిలో వాటాలు అందుతుండేసరికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాయకష్టం చేసే అన్నదాతల సొమ్మును ఆశించడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదన్నారు. ఐఏబీ సమావేశంలో కాలువలు శుభ్రం చేసి నీళ్లు వదలాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. గతంలో నీరు–చెట్టు పథకాన్ని ఏ విధంగా అయితే దోచుకోవడానికి వాడుకున్నారో, ఇప్పుడు నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కొత్త పేరుతో రైతులను అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తున్నారని, ఎమ్మెల్యేలు, పనులు చేయకుండానే బిల్లులు కాజేసేందుకు జేసీబీ దగ్గర కొబ్బరికాయలు కొట్టి హడావుడి చేస్తున్నారన్నారు. జేసీబీలను కేవలం ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టే ఫొటోల కోసమే వాడుతున్నారని, ఆ తర్వాత అవి పనిచేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతున్నాయన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి ఏ స్థాయికి చేరిందంటే, గంగాధర్‌ రెడ్డి అనే అధికారి నేరుగా ఫోన్‌ పే ద్వారా లంచాలు తీసుకున్నాడని పత్రికల్లో కథనాలు వచ్చినా.. కేవలం సస్పెన్షన్‌ తప్ప విచారణ జరిపి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో ఏసీబీ వ్యవస్థ అసలు పనిచేస్తుందా? అనిపిస్తుందని, బహిరంగంగా లంచాలు తీసుకుంటున్నట్లు ఆధారాలు ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఇరిగేషన్‌ పనుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరితే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నా రు. ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు పొంతన లేదన్నారు. ఒకే పనికి సంబంధించి మూడు వేర్వేరు సందర్భాల్లో బిల్లులు తీసుకున్నారని, కూటమి పాలనలో జరుగుతున్న అవినీతిపై ఏ రోజు అగ్రిమెంట్‌ అయింది, ఏ రోజు పని చేశారు, ఏ రోజు బిల్లు పెట్టారో గూగుల్‌ మ్యాప్స్‌ ఆధారాలతో అవినీతిని నిరూపించడానికి తాము సాంకేతికంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాలువలో కనీసం మట్టి కూడా తీయకుండానే కోట్లాది రూపాయల బిల్లులు చెల్లించారని, దీనిపై విజిలెనన్స్‌ విచారణ చేపట్టాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే తప్పు చేసిన ఏ అధికారిని విడిచి పెట్టేది లేదన్నారు. రేపు విచారణ జరిగినప్పుడు ఈ గూగుల్‌ మ్యాప్స్‌ ఫొటోలే మీ అవినీతికి నిదర్శనంగా నిలుస్తాయని, అవినీతి పాల్పడుతూ, రైతులను ఇబ్బంది గురి చేస్తున్న అధికారులపై విచారణ జరిపి, తగు ఆధారాలతో నిరూపించి కఠినంగా శిక్షిస్తామన్నారు.

ఇరిగేషన్‌ పనుల్లో

దొంగ బిల్లులు పెట్టి చేతివాటం

రైతులు చేసిన పనికి బిల్లులు

చేసుకున్న ఘనుడు

మాజీ మంత్రి కాకాణి ధ్వజం

Advertisement
 
Advertisement
Advertisement