నెల్లూరురూరల్: 35 ఏళ్లుగా ఉన్న బీజేపీ కార్యాలయాన్ని తీసివేసి, పీడబ్ల్యూడీ కెనాల్లో ఉందని తొలగించామని కమిషనర్ నీతులు చెప్పాలని చూస్తే ఊరుకోబోమని బీజేపీ నేతలు హెచ్చరించారు. గురువారం నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కెనాల్‌ను ఆక్రమించి పెద్ద భవంతులు కట్టుకున్నారని, వాటిని కూల్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. మీకు తెలియకపోతే ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తామన్నారు. అవినీతితో కమిషనర్ నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని, అతని ఆటలు చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బిల్డింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఎంత డబ్బు దండి ఆయనకు ఇస్తున్నారో తమకు తెలుసన్నారు. కమిషనర్ అవినీతి బుడగ త్వరలో పేలుస్తామని, వెనుకుండి నడిపించే వాళ్లను కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. కమిషనర్‌గా ఐఏఎస్‌లు లేరా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. నీ అంతట నువ్వే తప్పుకో అంటూ హితవు పలికారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి, నేతలు గడ్డం విజయ్‌కుమార్, భరత్‌కుమార్, యాకసిరి ఫణిరాజు, మండ్ల ఈశ్వరయ్య, రాజేష్, యశ్వంత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


