మనుబోలు: ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ లైన్‌మెన్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన మండలంలోని కట్టువపల్లి సబ్‌స్టేషన్ వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని కొలనకుదురులో ఎలిమేటి రామసుబ్బమ్మకు చెందిన రొయ్యల గుంతలను నెల్లూరుకు చెందిన షుకూర్ అహ్మద్ ఇటీవల కొనుగోలు చేశారు. విద్యుత్ కనెక్షన్‌ను తన భార్య నజీమా పేరుపై మార్చుకోవాలనుకున్నారు. దీనికి గానూ ఆన్‌లైన్లో ఏప్రిల్ 16న దరఖాస్తు చేసుకున్నారు. ఆపై కట్టువపల్లి సబ్‌స్టేషన్ లైన్‌మెన్ మల్లె రమేష్‌ను సంప్రదించగా, రూ.1.5 లక్షల లంచమిస్తే పైఅధికారులతో మాట్లాడి సర్వీస్‌ను మార్పు చేయిస్తానని చెప్పి, అదే రోజు రూ.50 వేలను షుకూర్ అహ్మద్ నుంచి తీసుకున్నారు. మరుసటి రోజున మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని సూచించారు. అయితే ఇవ్వలేకపోవడంతో దరఖాస్తును రిజెక్ట్ చేయించారు. దీనిపై షుకూర్ అహ్మద్ ప్రశ్నించగా, మిగిలిన రూ.లక్షను చెల్లిస్తేనే సర్వీస్‌ను మార్పు చేయిస్తానని రమేష్ చెప్పారు. తన వద్ద అంత డబ్బు లేదని, త్వరలోనే ఇస్తానని చెప్పి విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్లాన్ ప్రకారం రూ.లక్షను గురువారం ఇస్తానని చెప్పిన అహ్మద్.. ఏసీబీ అధికారులను అలర్ట్ చేశారు. కట్టువపల్లిలో రూ.లక్షను అహ్మద్ నుంచి రమేష్ తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


