నెల్లూరు(అర్బన్): ఊహించని ప్రమాదంతో ఆ వ్యక్తి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అవయవదానం ద్వారా అతను ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపి ధన్యజీవుడయ్యాడు. మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లి గ్రామానికి చెందిన పుచ్చకట్ల సుధాకర్ (40) గ్రామంలో చిన్నపాటి కిరాణాషాపు నడుపుతుంటాడు. అతని భార్య మానస గృహిణి. వారికి 11 ఏళ్ల భార్గవ్, 9 ఏళ్ల ఉదయ్, 7 ఏళ్ల బ్రిందా అనే కుమార్తె సంతానం. సుధాకర్ భార్య, ముగ్గురు బిడ్డలతో కలిసి సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే విధి చిన్నచూపు చూసింది.
మార్పు లేకపోవడంతో..
ఈనెల 10వ తేదీన సుధాకర్ పని నిమిత్తం మోటార్‌బైక్‌పై బద్వేలుకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో తిమ్మనాయుడుపేట సమీపంలో రోడ్డుపై ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్రగాయమైంది. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు నెల్లూరులోని కిమ్స్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో చేర్పించారు. సుధాకర్‌కు కృత్రిమ శ్వాస అందించి న్యూరోసర్జన్ డాక్టర్ కృష్ణమోహన్ ఆపరేషన్ చేశారు. అయినా కోలుకోలేదు. 24 గంటల తర్వాత కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో ఏపీఎన్‌ఈఏ టెస్ట్ చేయగా బ్రెయిన్ డెడ్ అని తేలింది. మరో 6 గంటల తర్వాత మరో ఇండిపెండెంట్ న్యూరో డాక్టర్‌తో పరీక్ష చేయించి బ్రెయిన్‌డెడ్ అని నిర్ధారించారు.
అంగీకరించి..
కిమ్స్ ఆస్పత్రి వైద్య బృందం అవయవ దానం ఆవశ్యకతను బాధిత కుటుంబ సభ్యులకు వివరించారు. సుధాకర్ అవయవదానంతో మరో ఐదుగురికి జీవితాలు ప్రసాదించవచ్చని తెలిపారు. పుట్టెడు దుఃఖంలోనూ భార్య మానస అంగీకారం తెలిపారు. బిడ్డలు కూడా నాన్నా.. నాన్నా అంటూ ఏడుస్తూనే నలుగురికి మంచి జరుగుతుందంటూ ఒప్పుకొన్నారు. దీంతో కిమ్స్ యాజమాన్యం ఈ విషయాన్ని జీవన్‌దాన్ ట్రస్ట్‌కు తెలిపింది. ప్రొటోకాల్ ప్రకారం అవయవాలను దానం చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తిరుపతికి అవయవాలు
ఆదివారం కిమ్స్ డాక్టర్లు సుధాకర్ కిడ్నీలు, గుండె, కళ్లు సేకరించారు. జీవన్‌దాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్‌లోని ఓ 14 ఏళ్ల కుర్రాడికి గుండెను అమర్చారు. తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో మరో రోగికి, కిమ్స్ ఆస్పత్రిలో ఓ రోగికి కిడ్నీని అమర్చారు. రెండు కళ్లకు సంబంధించిన కార్నియాలను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఒక్కో కార్నియాను ఒక్కో అంధుడికి అమర్చి ఇద్దరికి చూపును ప్రసాదించనున్నామని ప్రభుత్వాస్పత్రి డాక్టర్లు తెలిపారు. తిరుపతి ఆస్పత్రులకు అవయవాలు పంపేందుకు ఎస్పీ అజిత ఆదేశాల మేరకు పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. పైలట్ వాహనంగా పోలీస్ వాహనం వెళ్తూ ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూసింది. నెల్లూరు జిల్లా సరిహద్దు నుంచి తిరుపతి పోలీసులు వచ్చి ట్రాఫిక్ లేకుండా చర్యలు చేపట్టారు.
ఘనంగా వీడ్కోలు
పలువురి జీవితాల్లో వెలుగులు నింపిన సుధాకర్ భౌతికకాయానికి కిమ్స్ వైద్యశాల వైద్యబృందం, సిబ్బంది రెండు వరుసల్లో నిలబడి గౌరవ సూచకంగా ఘనంగా వీడ్కోలు పలికింది. సుధాకర్ అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చిన ఆయన కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాల మేరకు డీఆర్వో విజయకుమార్, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి సుధాకర్ భార్య మానసను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పిల్లల్ని ఓదార్చారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ అవయవదానం చేసిన ఆ కుటుంబ సభ్యులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. కలెక్టర్ సూచనతో డాక్టర్ మాధవి సుధాకర్ కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చుల కింద తాత్కాలికంగా రూ.10 వేలు నగదు అందించారు.
● ఈ సందర్భంగా కిమ్స్ యూనిట్ హెడ్ డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరాజు విలేకరులతో మాట్లాడారు. అవయవదానం చేయడం ద్వారా వేలాది మంది బతుకుతారన్నారు. సుధాకర్ కుటుంబ సభ్యుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో కిమ్స్ డాక్టర్లు కృష్ణమోహన్, జగదీష్, శేషయ్య, సతీష్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధాకర్
చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్
అవయవాలను దానం చేసిన
భార్యాపిల్లలు
గుండె, కిడ్నీ తిరుపతికి తరలింపు
సర్వజన ఆస్పత్రికి కళ్లు దానం
ఐదుగురి జీవితాల్లో వెలుగులు
నింపిన సుధాకర్


